మార్నింగ్ షో అప్పుడే వదిలారు. ఐనాక్స్ లోంచి బయటపడ్డాను.రెండు గంటలకు పైగా ఎయిర్ కండీషన్డ్ థియేటర్లో చల్లటి హాయికి అలవాటుపడ్డ దేహం బయట చురుక్కుమనే ఎండకు ఒక్కసారిగా చిటచిటలాడింది. రోడ్డుమీద నడుస్తుంటే వడగాలి ఒంటిని తాకుతూ కొరడా దెబ్బల్ని రుచిచూపించింది. పైన సూర్యుడు మంటల్లో కాలుతూ సజీవదహనమవుతున్నాడు.

కాస్తంతలో ఎంత మార్పు..! ఎంత తేడా..!మెత్తటి పరుపుమీంచి ముండ్ల మీద పడ్డట్టు, చల్లటి సరస్సులోంచి నిప్పుల కొలిమిలో దూకినట్టు.బస్టాప్‌వైపు వడివడిగా నడుస్తున్నాను. నగరంలోనే అతిపెద్ద చౌరస్తా. విపరీతమైన రద్దీ ఉండే నాలుగురోడ్లు అక్కడ కలుస్తాయి.గాలి కాలుష్యం, శబ్దకాలుష్యం, జనకాలుష్యం....వెరసి ఒక్క మానవ ప్రాణి తప్ప మిగతా ప్రాణులేవీ మనుగడ సాగించలేని కాంక్రీట్ జంగిల్. రోడ్లమీద వాహనాలు ఉరుకుతున్నయి. జనం రోడ్డుపక్కనే ఉన్న ఎత్తైన కాలిబాటల మీద వడివడిగా నడుచుకుంటూపోతున్నారు. రోడ్లను ఆక్రమించి జరుగుతున్న చిన్నవ్యాపారాలు, తోపుడుబండ్ల మీద అమ్మకాలు. అంత పెనెట్రేటింగ్ హీట్ లో ఎంతో డెస్పరేట్ అయితేతప్ప ఎవరూ బయట తిరగరు. కానీ అప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఎటు చూసినా ట్రాఫిక్.

మనుషుల్ని యంత్రాలను చేస్తున్న విపరీత వాతావరణంరోడ్లమీద జనం బాక్టీరియాల్లా కదులుతున్నారు. పాదచారులనే ప్రాణులకు ఈ నేలమీద కాస్త చోటివ్వాలన్న ధ్యాసగానీ, సానుభూతిగానీ లేకుండా వాహనాలు నడిపేస్తున్నారు.దుకాణాలు దాటుకుంటూ ముందుకు నడిచాను. ఆకలేస్తోంది. తొందరగా ఇంటికెళ్ళి భోంచెయ్యాలి. వెళ్లి బస్టాప్లో నిలబడ్డాను. భూమిలోంచి మొలుచుకొచ్చిన గడ్డిమొక్కల్లా ఇక్కడా జనమే. కిటకిటలాడుతూ షెడ్డుకింద నక్కారు. ఎర్రటి ఎండలో అట్లాగే నిలబడి బస్సుకోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో షెల్టరుకు అటువైపు నుంచి మెల్లగా నడుస్తూ వస్తున్న ఒక మనిషిమీద నా దృష్టి పడింది. అతడు వూరికే నడిచి రావడం లేదు. అడుక్కుంటున్నాడు. కొంచెం పరిశీలనగా చూస్తేతప్ప అతడు బిచ్చం అడుగుతున్నట్టు తెలియడం లేదు.

ముష్టివాళ్ళలో ఉండే కనీస బాడీ లాంగ్వేజ్ అతనిలో కనిపించడంలేదు. ‘‘అయ్యా.. అమ్మా.. బాబూ.’’ ఈ మూడు పదాలనే అతడు మెల్లగా పలుకుతున్నాడు. మళ్ళా మళ్ళా ఆ పదాలనే ఉచ్చరిస్తూ అక్కడ నిలుచున్నవాళ్ల ముందు దోసిలి చాపుతూపోతున్నాడు. మనిషి బలహీనంగా కుంచించుకపోయి ఉన్నాడు. అతని ఆకారం చూసి వయసు చెప్పలేని స్థితి. యాభైపైనే ఉండొచ్చు. కానీ డెబ్భైయేళ్ళ వాడిలా కనిపిస్తున్నాడు. ఒంటిమీద మాసిపోయిన అంగి, మట్టిరంగుతో పోటీపడే చినిగిన లూజ్‌ప్యాంట్‌ వేసుకున్నాడు. కళ్ళకు బాగా మందపాటి సోడాబుడ్డి అద్దాలు. పెరిగిన తెల్లటిగడ్డం. తలకు పాత తువ్వాల్ని రుమాలు మాదిరి చుట్టుకున్నాడు. ఎక్కడ దొరికాయో ఒకటి పెద్దది, మరోటి చిన్నదైన రెండు వేర్వేరు సైజుల్లో కాళ్ళకు పాత స్లిప్పర్లున్నాయి. ఒక్కమాటలో అతడు ఈ దేశంలో సాగాదీసుడుగా మిగిలిపోతున్న వృద్ధుల్లో ఒకడు.