వెనుకాముందూ చూడకుండా దబ్బున దూకాడు రాఘవ. దూకాలనిపించడానికి కారణం ఆ అమ్మాయి. మూడేళ్ళ పిల్లాడిని ముందు తోసి, తర్వాత తను దూకింది.సరిగ్గా రెండుగంటలక్రితం ఆ బ్యారేజీ దగ్గరకు రాఘవ వచ్చింది కూడా చనిపోవడానికే. బ్యారేజీలో పొంగిపొర్లే నీళ్ళను చూస్తూ, ‘ఎలా దూకాలి’ అని తను ఆలోచిస్తుండగానే ఆమె దూకేసింది. తనకు మించిన కష్టం ఏం వచ్చింది ఆమెకి?’ రాఘవలో ఆలోచనల అలజడి.

రెండురోజులనుంచి సరైన భోజనం లేదు. దాంతో అతడి శరీరం బలహీనంగా ఉంది. అయినా నీళ్ళలో ఆమెను వెతుకుతూ ఈదుతున్నాడు, శ్వాస సరిగ్గా అందడంలేదు. శక్తి కూడదీసుకుని ఈదుతుంటే, తుదిశ్వాస వదులుతూ కనిపించింది ఆమె. ‘ఓ గాడ్‌’ అనుకున్నాడు. పిల్లాడిని నీళ్ళలోకి తోసేశాక, ఆమె మనసు మారిందేమో, పిల్లాడిని కాపాడాలనిపించిందేమో. నీళ్ళు తాగుతున్న పిల్లాడిని పట్టుకుని ఒడ్డుకు లాక్కురావాలన్న ప్రయత్నంలో ఆమె విఫలమై తుదిశ్వాస విడిచింది. రాఘవ తనశక్తినంతా కూడదీసుకుని పిల్లాడిని చేతికి దొరకబుచ్చుకున్నాడు. ప్రాణభయంతో కొంత, ఊపిరి సరిగ్గా అందక మరికొంత, పిల్లాడు ఏడుస్తున్నాడు. పిల్లాడిని నది ఒడ్డుకు చేర్చాడు. మళ్ళీ నదిలోకి వెళ్ళి పిల్లాడి తల్లిని ఒడ్డుకు తీసుకువచ్చాడు.

ఆ అమ్మాయికి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది. ఏం కష్టం వచ్చిందో, ఊపిరి తీసుకుంది. ఒడ్డుకు చేర్చిన తల్లి శవంమీద పడి ‘‘అమ్మా..అమ్మా..’’ అని ఏడుస్తున్నాడు పిల్లాడు. రాఘవ కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్ళు తిరిగాయి. తన కళ్ళల్లో నీళ్ళు రావడమేంటి? తన కన్నీళ్ళు ఇంకిపోయి చాలాకాలమైంది కదా? ఆశ్చర్యపోయాడు. ఒక్క ఉదుటున వెళ్ళి పిల్లాడిని గుండెలకు హత్తుకున్నాడు.‘‘ఊరుకో నాన్నా..’’ అన్నాడు. అంతలో బ్యారేజీ మెట్లమీదనుంచి దిగిన జనం నది ఒడ్డుకు వచ్చారు.