‘‘అయ్యగారు ఫాంకి వెళ్ళారండి. గంటా, గంటన్నరలో వచ్చేస్తారు కూర్చోండి సార్‌!’’సోఫావైపు చూపిస్తూ అన్నాడతను. ఆ కంపెనీ ఎం.డి సార్‌ ఎప్పుడొస్తారని నేనడిగినదానికి జవాబది.ఎంత మర్యాద ఆ చెప్పటంలో...! చుట్టూ చూశాను. సోఫాల్లో అప్పటికే ఎవరెవరో కూర్చుని ఉన్నారు. అంతా సూటూ, బూటూ వేసుకుని ఎవరి ఫైళ్ళల్లో వాళ్లు మునిగిపోయి ఉన్నారు. ఏ.సి. శబ్దంతప్ప మరేమీ వినిపించనంత నిశ్శబ్దం అక్కడంతా. రూంఫ్రెష్‌నర్‌ ఉండుండి ముక్కుపుటాలను తాకుతోంది.

‘‘మంచినీళ్ళు తాగుతారా?’’ మర్యాదగా అడిగాడతను.వద్దన్నట్టు మెల్లగా తలూపి అంతసేపూ ఇక్కడ కూర్చోవడం ఎందుకని బయటకు నడిచాను.ఆరు అంతస్తుల భవనమది. బస్‌లో వెళుతూ చాలాసార్లే చూశాను ఆ భవనాన్ని. పనిమీద ఆ ఆఫీసుకి రావటం మాత్రం ఇదే మొదటిసారి. అదైనా శ్రీరాం చెప్పబట్టి. మామూలుగా అయితే నమ్మేవాణ్ణోకాదోకానీ ఒక పక్క మిద్దెతోటల్ని పెంచుతూ, మరో పక్క అలా తాను సాధించిన మిద్దెతోటల ఉత్పాదకత, లాభాల మీద శ్రీరాం రాసిన పుస్తకాన్ని చూశాక నమ్మక తప్పలేదు. దానికి ఈ ఆఫీస్‌ ఎం.డి.యే స్పాన్సరర్‌ అట.ఆలోచిస్తూనే తలెత్తి భవనంపైకి చూశాను. చక్కటి ఖరీదైన ఎలివేషన్‌. బయటి ఎలివేషనే ఇలా ఉంటే లోపల ఇంటీరియర్‌ ఇంకెంత బాగుంటుందో? ఎలాగు సమయం ఉంది.

ఇలా బయట నిలబడి వెయిట్‌ చేసే బదులు లోపలంతా తిరిగి ఒకసారి చూస్తే పోయిందేముంది?’’ అనుకుంటూ లిఫ్ట్‌కేసి నడిచాను.అప్పటికే చాలామంది నిలబడి ఉన్నారు లిఫ్ట్‌ దగ్గర. రకరకాల పెర్ఫ్యూమ్స్‌ కలబోసిన వాసన లిఫ్ట్‌లోకి వెళ్లగానే గుప్పుమంది ఒక్కసారిగా. ఉక్కిరిబిక్కిరయ్యాను ఆ కాసేపూ.అన్నీ సొంత ఆఫీసులేనేమో. ఒక్కోఫ్లోరూ ఎంత ఆధునికంగా నిర్మించారో చూస్తే తల తిరిగి పోతోంది. ఒకదాన్ని మించి మరొకటి. అలా చూస్తూ మెట్ల మీదుగా దిగుతున్నాను. రెండోఫ్లోర్‌లోకి వచ్చేసరికి ఆయాసంవచ్చింది. ఒకచోట ఖాళీకుర్చీ కనిపిస్తే అందులో కూలబడ్డాను. అప్పటికింకా ముప్పావుగంట టైముంది.