‘‘పిన్నీ! వాట్‌ హాపెంటు అమ్మా?’’ అవతల్నించి ప్రశ్న - కత్తి దూసినట్టు.గగనకి చాలా కోపం వచ్చినపుడు తన కంఠధ్వని కత్తితో కోస్తున్నట్టు, మాట వేడిచువ్వతో వాత పెట్టినట్టుంటుంది.పొద్దున్నే ఫోన్‌ చేసి పలకరింపుగా అన్నమొదటి వాక్యమే అది. ఎందుకో దానికి అక్క మీద చాలా కోపంగా, చిరాకుగా ఉందని అర్థమైంది. గడియారం వైపు చూశా. నా యోగా క్లాసుకి టైమైపోతోంది.‘‘గగనా! ఏమిటైందో చెప్పకుండా అలా అడిగితే ఎలామ్మా?’’ అన్నా. ఏమైంది దీనికి మళ్లీ? ఈ మధ్య మరీ తల్లికీ కూతురికీ పడకుండా అయిపోతోందేమిటీ? ఎవరైనా దేశంలో ఉన్నన్నాళ్లూ తల్లిదండ్రులమీద చిర్రుబుర్రులాడినా, విదేశాలకి వెళ్లాక ఎక్కడలేని ప్రేమలూ ఒలకబోస్తారే!‘‘నీకు వినేందుకు టైముంటే చెప్తాను’’ నిష్ఠూరం!‘‘అయిదు నిముషాలుందే. 

నేనో యోగా క్లాసుకి వెళ్తున్నానీ మధ్య. పద్మాంటీ వాళ్ల ఇంటి ఎదురుగా. ఆరున్నరకి అక్కడుండాలి’’ మాట్లాడుతూనే యోగా మాట్‌ తీసిపెట్టుకుని,మంచి నీళ్ల సీసా నింపుదామని వంటింట్లోకి వెళ్లాను.‘‘పిన్నీ! ఇపుడు మీకు ఆరుగంటలే అయిందింకా. అయిదు నిముషాల నడక. మనం ఇరవై నిముషాలు మాట్లాడుకోవచ్చు. ఇంత దూరంనించి నీతో అవసరం పడి ఫోన్‌ చేస్తే, నువ్వొక పది నిముషాలు ఆలస్యంగా వెళ్తే మాత్రం ఏమైంది?’’ అలకగా, డిమాండింగ్‌ గా అంది.‘ఓసినీ’ అనుకున్నాను. ‘‘అలా కుదరదులే గాని, విషయం ఏమిటో చెప్పు.’’‘‘నెక్ట్స్‌ ఫ్రైడే నా ఫ్రెండ్స్‌ ముగ్గురు హైదరాబాద్‌ వస్తున్నారు పిన్నీ, ఒక వారం కోసం. ఇపుడు ఇంట్లో ఉంటున్నది అమ్మా నాన్నా ఇద్దరే కదా.. మామ్మకూడా ఇపుడు చిన్నమామ్మ దగ్గరే ఉంటోంది!

మా ఇల్లు పెద్దది కదా అని మా ఇంట్లో ఉండచ్చని వాళ్లకి చెప్పాను. ‘అలా కుదరదు. ఎక్కడైనా హోటల్లో ఉండమని చెప్పు’ అంటోందిపుడు!! ఐ గాటె షాకాఫ్‌ మై లైఫ్‌! నేను కాలిఫోర్నియా వెళ్లినపుడు వీళ్లలో ఒకళ్లింట్లో ఉన్నాను రెండు రోజులు. ‘అమ్మా మాటిచ్చేశా కదా, ఈసారికి అడ్జస్టవు. నెక్స్ట్‌ టైమ్‌ అలాగే చెప్పచ్చు’ అంటే కనీసపు కర్టెసీ కూడా లేకుండా ‘నన్నడిగి మాటిచ్చావా?’ అంటోంది! ఏమైందీవిడకి?’’