గడ్డానికి షేవింగ్‌ ఫోమ్‌ పులుముతోంటే ‘‘ఆగండాగండి..’’ అని అరిచింది శ్రీమతి.అదిరిపడి, చేతిలోని బ్రష్‌ వదిలేసి, ఒక్కడుగు వెనక్కి జంప్‌ చేశాను.‘‘ఏవయ్యిందే’’‘‘హమ్మయ్య, సమయానికి నేను చూడబట్టి సరిపోయింది. లేకపోతే కొంప కొల్లేరైపోయేది’’.‘‘ఎవరి కొంప?’’‘‘ఇంకెవరిదో కాదు అక్షరాలా మనదే’’

‘‘మనది గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయే కొంపకాదు అపార్ట్‌మెంటు. వాన వస్తే జలదిగ్బంధ మవుతుంది తప్ప మన బిల్డింగుకేం కాదు’’‘‘మీ జోకు మండినట్టే ఉందిగానీ ముందు గడ్డానికి పట్టించిన ఆ సోపు శుభ్రంగా కడిగేసు కోండి’’‘‘ఏం?’’‘‘మీరు గడ్డం చేసుకోడానికి వీల్లేదు’’.‘‘ఇదెక్కడి కొత్త రూలే? గడ్డం అడ్డం అంటావు. ముద్దుపెట్టుకోవాలంటే గడ్డం గుచ్చుకోకూడదంటావు. అసలందుకే కదా నిత్య షేవింగ్‌ పథకం మొదలెట్టానూ!’’‘‘ఆ సోది మరచిపోండి. నేను చెప్పేదాకా మీరు గడ్డం చేసుకోడానికి వీల్లేదు’’.నా బుర్రలో ట్యూబ్‌లైట్‌ వెలిగింది. ‘‘కొంపతీసి గడ్డం పెంచుకోడానికి పర్మిషన్‌ ఇచ్చేస్తున్నావేంటోయ్‌ కాంతామణీ’’.

‘‘దానికోసం మీరేమీ పనిగట్టుకుని కొంపతీయక్కర్లేదు. ఇవాళారేపు గడ్డంపెంచడం ఫ్యాషనే. మగతనానికి ఒకటోరకమైన చిహ్నం, నాగార్జున, నాగచైతన్య, జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌..వారూ వీరూ ఏంటి అంతా ఎంచక్కా గడ్డాలు పెంచేస్తున్నారు. ఆఖరికి చాక్లెట్‌ ఫేస్‌ మహేష్‌బాబు కూడా కొత్తసినిమాలో గడ్డం పెంచేస్తున్నాట్ట! అన్నట్టు మీకీసంగతి తెలుసా? నాగచైతన్య గడ్డంచూసే సమంత అతడి ప్రేమలో పడిపోయిందిట!’’ఎగిరి గంతేశాను. ‘‘వావ్‌. ఎంత గొప్పమాట చెప్పావు. నేనూ గడ్డం పెంచేస్తా. ఇక గడ్డంరాజా అయిపోతా’’ కాలర్‌ ఎగరెయ్యబోయి బనీనుతో ఉన్నానని గ్రహించి ఆ ప్రయత్నం విరమించాను.కాంతం నా దగ్గరికొచ్చి నా ముఖాన్నీ గడ్డాన్నీ ఎగాదిగా చూసింది. ‘‘మీ గడ్డం ఫరవాలేదు. బాగానే ఉంటుందండీ..’’