వీరభద్రం ఎన్నికలలో పోటీచేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయా! వీరభద్రం, నేనూ కలిసి చదువుకున్నాం. వాడు ఇంటర్మీడియెట్‌ తప్పి వ్యాపారంలో పడ్డాడు. నేను డిగ్రీ చదివి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డాను.వీరభద్రానికి వంశపారంపర్యంగా ఉన్న కలప అడితి, వ్యాపారం ఉన్నాయి. ఊళ్లో ఇళ్లు ఆస్తులున్నాయి. కొద్దోగొప్పో బంధుగణం ఉంది. పిల్లనిచ్చిన మామగారు బాగా స్థితిమంతుడు. అలాంటివాడు ఏకంగా జనరల్‌ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయడం నాకేకాదు నియోజకవర్గంలో పెను సంచలనమే సృష్టించింది.

వీరభద్రం తండ్రి పరబ్రహ్మం నాకు ఫోన్‌చేసిమరీ ఏడుస్తూ, ‘‘నువ్వూ మావాడూ స్నేహితులు. నువ్వొక్కడివే చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు. మిగతావాళ్లంతా వాడిమీదపడి బతికేవాళ్లే. పనీపాటలేని సన్నాసులు. ఎవరు సలహా ఇచ్చారో లేక వీడికే ఆ దుర్భుద్ధి పుట్టిందో ఎన్నికల్లో నిలబడు తున్నాడు. వద్దురా మనకీరాజకీయాలు అంటే వినడంలేదు. పైగా అన్నిపార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్‌ చలపతిరావుగారిని నిలబెట్టారు. ఆయన దేవుడులాంటి డాక్టరు. ఆయనతో పోటీపడితే వీడికి డిపాజిట్‌కూడా రాదు. పైగా డబ్బు దండగ, పరువుపోతుంది. కనీసం నీ మాటైనా వింటాడేమో అని ఆశ. బాబ్బబు కాస్త వాడికి చెప్పి ఒప్పించు’’ అని బ్రతిమిలాడాడు.వీరభద్రం తండ్రి పరబ్రహ్మం ఆవేదనలో అర్థం ఉంది.

వారూవీరని తేడాలేకుండా తెలిసినవాళ్లకు, తెలియనవాళ్లకు అందరికీ ఉచితంగా వైద్యం చేస్తారు డాక్టర్‌ చలపతిరావుగారు. ఎవరు ఏమిచ్చినా పుచ్చుకోడు. ఎవరైనా ఇచ్చినా, ఇవ్వదలుచుకున్నా కాంపౌండరు శంకర్రావుకే ఇవ్వాలి. ఆయన పుచ్చుకోడు. రోగులు అక్కడ బల్లమీద పెట్టిపోతారు.డాక్టర్‌ చలపతిరావుగారు వీధిలోకొస్తే రిక్షావాడు, ఆటోవాలా, కారున్నవాళ్లు ఆగి ‘‘రాండిసార్‌, - ఎక్కడికెళ్ళాలి’’ అని మర్యాదగా, వినయంగా అడుగుతారు. దారినవెళ్ళే వాళ్లు దుకాణాల్లో ఉన్నవాళ్లు మర్యాదగా నిలబడి నమస్కరిస్తారు.