‘‘రైతు బజార్లో సన్నబియ్యం తగ్గింపు ధరకిస్తున్నారట. అలా కాళ్ళు బార్లాచాపుకుని ఖాళీగా కూర్చోకపోతే, వెళ్ళి తేరాదూ!’’ భర్త కుందనరావుతో అంది మహేశ్వరి.పదవీవిరమణ అనంతరం ప్రపంచంలోని విశ్రాంతినంతటినీ తానొక్కడే అనుభవిస్తున్నంత కులాసాగా కూర్చుని ‘కుక్కటంతో కోటి రకాలు’ అన్న వంటల కార్యక్రమాన్ని కన్నార్పకుండా వీక్షిస్తున్న కుందనరావు, ‘‘అబ్బ! ఉండవే. చికెన్‌తో ఎన్నిరకాల వంటలు చేయవచ్చునో సవివరంగా చూపిస్తున్నారు...’’ అన్నాడు టీవీ తెరమీదనుంచి దృష్టి మరల్చకుండానే.

‘‘ఏడిచినట్లే ఉంది, మనం పక్కా శాకాహారులంకదండీ...’’ మగని వాలకానికి అబ్బురపడుతూ కస్సు బుస్సులాడింది మహేశ్వరి.చటుక్కున నాలిక్కరుచుకున్న కుందనరావు ‘‘అవును కదూ! మరి నేనెందుకిలా నాన్‌వెజ్‌ వంటల కేసి కన్నార్పకుండా చూస్తున్నాను చెప్మా! అయినా ఈమధ్య బుద్ధికాస్త మందగిస్తోందోయ్‌. ఏం చేస్తున్నానో తెలియడం లేదు’’ అయోమయంగా తలగోక్కున్నాడు.‘‘ఆఁ... తమరికి తీరిక ఎక్కువై తింగరితనం పెరిగిపోతోంది, ఆ ఫలితమే ఇదంతా’’ అదోలా అంది మహేశ్వరి.‘‘నీకీమధ్య ‘ఎటకారం’ కూస్తంత ఎక్కువైనట్టుందే. సరేలే ఆ సంచి ఇలా తగలెయ్యి. వెళ్ళిఛస్తాను’’ అని చేతిలోని రిమోట్‌ దివాన్‌ మీద గిరాటేసి షర్టు తొడుక్కుని వీధిలోకి నడిచాడు.

వెళ్ళేముందు టీపాయ్‌ మీదున్న ఆనాటి దినపత్రికను ఓ మారు తిరగెయ్యడం మరచిపోలేదు. ఆ దృశ్యం మహేశ్వరి కంట గనుక పడుంటే ఆ ఇంట్లో చిన్నసైజు రామరావణ సంగ్రామమే జరిగుండేది.ఆ వెళ్ళడం వెళ్ళడం మరొక రెండుగంటలదాకా ఐపూ అజా లేకుండాపోయాడు కుందనరావు. అతడు వెళ్ళిన అరగంటకి బజారుకు వెళ్ళిన పక్కింటి పాపారావు మరో పావుగంటకే రిక్షాలో బియ్యంమూట వేసుకుని దిగడం చూసి ఆశ్చర్యపోయింది మహేశ్వరి.‘‘అన్నయ్యగారూ, అక్కడ మావారు కనిపించలేదా మీకూ!’’ ఆదుర్దాగా ప్రశ్నించింది మహేశ్వరి.

‘‘లేదమ్మా, ఇంచుమించు నేను వెళ్ళేసరికే స్టాకు అయిపోయిందని కౌంటర్‌ మూసేస్తున్నారు. కాళ్ళావేళ్ళాపడి ఓ పావుమూటబియ్యం సంపాదించేసరికి తాతలు దిగివచ్చారు’’ ఏదో నిధిని సంపాదించినంత సంతృప్తిగా బియ్యం మూట తడిమి చూసుకున్నాడు పాపారావు.‘‘మరి ఈయనగారేమైనట్టో!’’ ఆలోచనలో పడింది మహేశ్వరి. ఎండ పిడుగులు పడుతున్నట్లుగా ఉన్న ఆ మిట్టమధ్యాహ్నంవేళ, ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయి, రిక్తహస్తాలతో ఇల్లుచేరాడు కుందనరావు.‘‘ఇంతసేపు ఏమైనారండీ?’’ ఎదురెళ్ళి కంగారుగా అడిగింది మహేశ్వరి.