ఒక భాగ్యవంతుడింట్లో పనిమనిషిని మాటలతో లొంగదీసుకున్నాడో దొంగ. ఓ రోజు అతడు చెప్పినట్టే చేసింది ఆమె. రాత్రివేళ భాగ్యవంతుడి ఇంటి తలుపులు తెరచి ఉంచింది. దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించి ఇనప్పెట్టె తెరచి వజ్రవైఢూర్యాలు, ధనం ఒక వస్త్రంలో మూటకడుతున్నాడు. అంతలో భీకరాకారుడైన ఆ ఇంటి కావలివాడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ భాగ్యవంతుడు ఏం చేశాడు?

పూర్వం ఒకానొక గ్రామంలో దయాసాగరుడనే భాగ్యవంతుడు ఉండేవాడు. సిరిసంపదలలో ఆ చుట్టుపక్కల అతడికి సాటిరాగలవారు ఎవ్వరూలేరని ప్రతీతి. తాననుకున్నది ఎదుటివారికి ఇష్టం లేనప్పుడు కూడా, చక్కని తర్కంతో వారిని ఏ మాత్రం నొప్పించకుండా ఒప్పించగలడు, ఆ తార్కికజ్ఞానం సిరిసంపదలకంటే గొప్పదని అందరూ చెప్పుకుంటారు.దయాసాగరుడికి ఆర్భాటాలు కిట్టవు. వైభవంగా జీవించడం ఇష్టముండదు. తాను అందరిలాగే సామాన్యంగా ఇంట్లో ఉంటూ, అవసరంలో ఉన్నవారికి దానధర్మాలతో సహాయపడేవాడు. అది అతడి భార్య అనంతలక్ష్మికి నచ్చేది కాదు. ఒకసారి ఆమె భర్తతో, ‘‘మనకి బోలెడు డబ్బుంది. అదంతా ఇతరుల సుఖానికేనా? మనం సుఖపడడానికి పనికిరాదా?’’ అని అడిగింది.అందుకు బదులుగా దయాసాగరుడు చిరునవ్వు నవ్వి, ‘‘మనుగడకు ముఖ్యావసరాలైన తిండి, బట్ట, నీడ మనకు సమృద్ధిగా ఉన్నాయి. ఇతరత్రా కూడా మనకు అన్ని సుఖాలూ ఉన్నాయి. అవసరానికి మించిన సుఖం మనిషి కోరుకోకూడదు’’ అన్నాడు.

‘‘అలాంటప్పుడు ఉన్నదాంతో తృప్తిపడక, అవసరానికి మించి సంపాదించడం ఎందుకు?’’ అన్నది అనంతలక్ష్మి రోషంగా.‘‘ఎల్లకాలం మనమిలాగే సంపాదించలేం కదా! మున్ముందు అవసరపడుతుందని ఇప్పుడు ఎక్కువగా సంపాదిస్తున్నాను. అదీకాక, భగవంతుడు గాలి, నీరు, భూమి అందరికీ సమంగా ఇచ్చి, తెలివితేటలు మాత్రం ఒక్కలాగా ఇవ్వలేదు. అందుకని కొందరు పూటగడవనిస్థితిలో ఉన్నారు. అలాంటి పేదవారి మధ్య బ్రతుకుతూ వైభవంగా జీవిస్తే మనకు సంతోషం ఉండదు. పైగా వారికి కన్నెర్రగా కూడా ఉంటుంది. ఔనా?’’ అన్నాడు దయాసాగరుడు.‘‘ఇతరులతో నాకు పనిలేదు. ఉన్నంతలో వైభవంగా జీవిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది’’ అన్నది అనంతలక్ష్మి మొండిగా.‘‘సరే, నీ సంతోషానికి తగిన ఏర్పాట్లు చేస్తాను’’ అన్నాడు దయాసాగరుడు.