ఒకానొకప్పుడు కోసలదేశాన్ని భక్తిసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన శివపూజా దురంధరుడు. తను నిత్యపూజలు చేయడమేకాక దేశంలోని ప్రజలందరూ కూడా విధి, నియమం తప్పకుండా ప్రతిరోజూ శివపూజ చేయాలని శాసించాడు. అందుకై శివాలయాలు లేనిచోట శివాలయాలు కట్టించాడు. పాడుబడ్డ శివాలయాలన్నింటినీ బాగుచేయించాడు.రాజుకు రాజ్యపాలనపై బొత్తిగా దృష్టి లేదని గ్రహించిన మంత్రి దేవనాథుడు, ‘‘ప్రభూ! తమరు రాజు కాగానే కొత్త మార్పులు ప్రవేశపెడతారనీ, తమ తండ్రిగారి హయాంలో జరిగిన కొన్ని లోపాలు తొలగిస్తారనీ ప్రజలు ఆశిస్తున్నారు. వారి ఆశలు నెరవేర్చడానికిగానూ, మీరు ప్రజాపాలనగురించి మంత్రులలో చర్చించవలసి ఉంది’’ అని కోరాడు.

‘‘మా తండ్రి హయాంలో శివపూజకు ప్రాముఖ్యమివ్వకపోవడమే పెద్ద లోపం. ఇప్పుడాలోటు తీరింది కాబట్టి ఇకమీదట ప్రజలకేమీ ఇబ్బందీ ఉండదు. అన్నింటికీ ఆ శివుడే ఉన్నాడు’’ అన్నాడు భక్తిసేనుడు. చేసేదిలేక మంత్రి మిన్నకుండిపోయాడు.ఇలా కొన్నాళ్లు గడిచేసరికి రాజ్యంలో క్షామం వచ్చింది. ఎందరో ప్రజలు తిండిలేక చనిపోయారు. ఇది తెలిసి భక్తిసేనుడు ఎంతో బాధపడి, ‘‘నేను శివుణ్ణి పూర్తిగా నమ్మాను. ఇలా ఎందుకు జరిగింది?’’ అన్నాడు. నిజానికి రాజ్యపాలనాబాధ్యత శివుడిదికాదు. రాజుది. కానీ ఎవరు ఎంతచెప్పినా భక్తిసేనుడికి ఆ విషయం అర్థంకావడంలేదు. అందుకని మంత్రి ఓ కొత్త ఉపాయం ఆలోచించాడు.

అతడు రాజుతో, ‘‘ప్రభూ! మనదేశంలో శివుడొక్కడే దేవుడు కాదు. శ్రీ మహావిష్ణువు కూడా శివుడంతటి దేవుడు. శివపూజమైకంలో మీరు ఆయన్ని నిర్లక్ష్యం చేశారు. అందుకు విష్ణువు అలిగి తన ప్రతాపం చూపించాడు’’ అన్నాడు.‘‘అలా విష్ణువు తన ప్రతాపం చూపిస్తే శివుడు ఊరుకుంటాడా?’’ అన్నాడు భక్తిసేనుడు.‘‘శ్రీ మహావిష్ణువును నిరోధించగలశక్తి శివుడికి లేదని, ఎన్నో పురాణాలు ఘోషిస్తున్నాయి. మనదేశంలో కూడా ఆ విషయం ఇప్పుడు ఋజువైంది’’ అన్నాడు దేవనాథుడు. ‘‘అయితే ఇప్పుడు నేనేంచేయాలి?’’ అన్నాడు భక్తిసేనుడు సాలోచనగా.