రైతు అందరికీ అన్నం పెట్టాలి. రాజు పాలించాలి. మంత్రి సలహాలిచ్చి రాజ్యాన్ని నడిపించాలి. ధనవంతుడు పేదలను కాపాడాలి, నిజాయితీపరులను గుర్తించి ఉద్యోగావకాశాలిచ్చి ధర్మం కాపాడాలి. అంతేతప్ప నిజాయితీపరుణ్ణి పదే పదే అవమానించి అతడు దొంగగా మారడానికి ధనవంతుడు కారణం కాకూడదు. కానీ ఈ కథలో ఓ ధనవంతుడు నిజాయితీపరుణ్ణి శంకించి కష్టాలపాల్జేశాడు. తప్పుతోవ పట్టేందుకు కారకుడయ్యాడు. అప్పుడు నిజాయితీపరుడు ఏం చేశాడంటే....

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, ఇచ్చినమాట తప్పకూడదని ఈ అపరాత్రిపూట నువ్విక్కడ శ్రమపడుతున్నావు. అందువల్ల ఏ ప్రయోజనం ఆశిస్తున్నావో తెలియదు. ఇచ్చినమాట తప్పినాకూడా తమ ప్రయోజనాల్ని సాధించుకున్న ఓ దొంగ, రాక్షసులగురించి తెలిస్తే, నీ మనసు మార్చుకుంటావని నా నమ్మకం. శ్రమతెలియకుండా నీకు ఆ కథ చెబుతాను, విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.

ఒకానొకప్పుడు చతురనగరంలో విజయుడనే యువకుడు ఉండేవాడు. అతడి పదేళ్లవయసులోనే తలిదండ్రులు ప్రమాదంలో చనిపోయారు. అప్పటినుంచీ నా అనేవాళ్లులేక, పొట్ట గడవడానికి ఆ ఇంటా ఈ ఇంటా పనిచేస్తూ పెరిగిపెద్దవాడయ్యాడు విజయుడు. కొన్నాళ్లకి స్థిరంగా ఎక్కడైనా పనికి కుదురుకోవాలన్న కోరిక పుట్టింది అతడికి. నగరంలో పేరుపొందిన వ్యాపారి ధనగుప్తుడివద్దకువెళ్లి తన కోరిక చెప్పాడు.‘‘నాకు మనిషి అవసరం ఉంది. ఆ మనిషి నిజాయితీపరుడై ఉండాలి. నిన్ను పనిలోకి తీసుకుందామంటే నువ్వు ఎవరివో నాకు తెలియదు. నిన్నూ నన్నూ ఎరిగినవారెవరైనా నీ గురించి సిఫార్సుచేస్తే తప్పక నీకు ఉద్యోగమిస్తాను’’ అన్నాడు ధనగుప్తుడు.సిఫార్సుకోసం విజయుడు తనకు తెలిసినవారినందరినీ కలుసుకున్నాడు. ఐతే వాళ్లంతా అతడివల్ల అంతో ఇంతో ప్రయోజనం పొందుతున్నారు. అతడు స్థిరపడితే తమకు నష్టమని భావించి, ‘‘ధనగుప్తుడు ప్రమాదకరమైన మనిషి. మున్ముందు ఎప్పుడైనా నీ వల్ల తప్పు జరిగితే సిఫార్సు చేసినందుకు మా పని పడతాడు. సిఫార్సు తప్ప ఇంకేమడిగినా నీకు సాయం చెయ్యగలం’’ అన్నారు వాళ్లు.విజయుడు హతాశుడయ్యాడు. ఆ సమయంలో అతడికి భద్రుడనేవాడు కనిపించి, ‘‘ధనగుప్తుడివద్ద ఓ ఉద్యోగం ఖాళీగా ఉందని నీ మూలంగా చాలామందికి తెలిసిపోయింది. ప్రతిఒక్కరూ ఒకోమనిషిని సిఫార్సు చేస్తున్నారుట. ధనగుప్తుడు ఎటూ తేల్చుకోలేక నన్ను సహాయం అడిగాడు. నేను నిన్ను సిఫార్సు చేస్తాను. అయితే అందుకు నాకు వెయ్యి వరహాలు కానుకగా ఇవ్వాలి’’ అన్నాడు.