‘మమ్మీ నీ బిడ్డకు చెప్పు. అది పిచ్చి పిచ్చి డ్రెస్‌ లేసుకొని ఫోజులు గొడ్తంది.’‘నీ కొడుక్కు జెప్పు మమ్మీ ... యెప్పటికి నా డ్రెస్‌ల మీద పడి యేడువద్దని. ఛత్‌, మూడంత ఖారాబయింది. వీని కన్ను మంచిది గాదు. బేకార్‌ కన్నులు. అయినా మమ్మీ వాడేమి డ్రెస్‌లు వేస్కున్నాడని నేనేమన్నా కామెంట్స్‌ చేస్తున్నానా... వాడెందుకు చెయ్యాలె మమ్మీ. నీ కొడుకును నా డ్రెస్‌ విషయంల ఇంటర్‌ఫేర్‌ కావొద్దని చెప్పు.

’స్వప్న, సాగర్‌లు కొట్టుకుంటున్నారు - తల్లిని మద్యల బెట్టి.ఇది వాల్లమ్మ స్వర్ణకు రోజూ వున్నదే. డైరెక్టుగా కొట్లాడలేక తల్లిని మద్యల బెట్టి కొట్లాడ్తుంటరు అన్నాచెల్లెలు. వీల్ల గొడువలు రోజూ స్వర్ణకు తలనొప్పే. కరువుమంటే కప్పక్కోపమే, యిడువుమంటె పాముకు కోపమన్నట్లున్నా బిడ్డదిక్కే మాట్లాడ్తది స్వర్ణ.‘ఏందిర, వూకె దాని బట్టల మీదేడుస్తవు, నువ్వు ప్యాంటు, టీషర్టు యేస్కుంటె లేని తప్పు చెల్లేస్కుంటెనే వచ్చిందార’ అని కొడుకుని అదిలిచ్చింది.‘అది నాలాగ ప్యాంటు షర్ట్‌ యేస్కుందే - అదీ టైట్‌ జీన్‌ ప్యాంట్‌ తెల్సానె, నువ్వుగూడ దాన్నే యెన్కేసుకొస్తవు అన్నిట్ల. అందికే అది నీ అండ జూస్కొని గలీజు, గలీసు బట్టలేస్కుంటంది. బైట మా దోస్తుగాల్లు నన్ను తిడ్తుండ్రు ‘మీ చెల్లెకు నువ్వున్నా జెప్పురా’ అని. యిజ్జత్‌ కచ్‌రా చేస్తుందిది. మీ తల్లి బిడ్డలొకటే.. డాడీకి చెప్తెగాని సక్కగకారు’ అనంగానే స్వప్న రోషంగా ‘మమ్మీ వీడెంత దొంగ గాడిదంటే నన్ను యింట్ల యిట్లా సతాయిస్తడు గదా!

నాలాగే డ్రెసేస్కున్న నా ఫ్రెండ్సుని మాత్రమే ‘వావ్‌! స్మార్ట్‌, సో నైస్‌, సో క్యూట్‌ డ్రెస్‌ అని ఎందుకు పొగుడ్తడో అడుగు.’స్వప్న, సాగర్‌ ఒకటే కాలేజిలో ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. వీల్లు అన్నింట్ల మంచిగ ప్రేమగానే వుంటరు గానీ గీ డ్రెసు విషయంలోనే యిద్దరికి ఉప్పు నిప్పుల చిటపట. స్వప్న డ్రెస్‌ని, సాగర్‌ ఎంత అన్న అయినా డిసైడ్‌ చేయడము స్వర్ణకు కూడా కోపమే.‘ఏందిరా సాగర్‌.. దాని మీద నీకంట్రోల్‌ ఏందిరా? దానిష్టమున్న బట్టలేస్కుంటది. ఈ వయసులో యేస్కోకుంటె ఎప్పుడేస్కుంటది. దాన్ని యిట్లా రోజు సతాయించుడు, ఏడిపిచ్చుడు మంచిదేనారా! అది నీ బట్టల మీద జోక్యమ్‌ చేసుకోనప్పుడు నువ్వెందుకు చేస్కుంటవురా! దాన్నేమన్నా నేనూరుకోనురా’ అని కొడుకుని కోప్పడి స్వర్ణ బిడ్డ పట్టునుంటది. వేరే విషయాల్లో ఎట్లున్నా డ్రెస్‌ల విషయంలోనైతే బిడ్డకే సపోర్ట్‌ ఎందుకు చేస్తదంటే ... స్వర్ణకు యిట్లాంటి బాదలు, హింసలు, సతాయింపులు పడి వచ్చింది గనుక. బట్టల ఆంక్షలతోని తనుబడ్డ హింసలు అన్ని యాదికొచ్చినయి.