వాళ్ళు ముగ్గురూ స్నేహితులు. వారిలో ఒకరికి నోరు తిరగని పేరుండే మాయదారి రోగం వచ్చింది. ఆత్మహత్యా ప్రయత్నం చేశాడా స్నేహితుడు. ఎందుకంటే, ఫారిన్‌ రిటర్న్‌ డాక్టర్‌కి చూపిస్తే, చావు తప్పదని తేల్చేశాడుమరి. ఇక ఉండబట్టలేక వారిలో ఒకడు పురాతన వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆయన అతడి కళ్ళూ, పళ్ళూ పరీక్షించి, నువ్వు ఫలానా ఊరుగానీ వెళ్ళావా ఈ మధ్య అని అడిగాడు. ఔనన్నాడతను. అప్పుడు ఆ వైద్యుడు ఏం చేశాడంటే.....

 

మధ్యాహ్నం రెండు గంటలకు భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నా. ఇంతలో ఫోన్‌!‘‘బాబూ! అర్జెంట్‌గా మా ఇంటికి రా! నీ ఫ్రెండ్‌కి...’’అంతే! ఫోన్‌ కట్‌!భద్రయ్యగారి స్వరంలో ఆందోళన. వాళ్లింట్లో అద్దెకున్న నా ఫ్రెండ్‌ గోపాల్‌కి ఏమైందో. వారంక్రితం కొనుగోళ్లనిమిత్తం నేను సూరత్‌ వెళ్లినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న గోపాల్‌ని డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లానని సూర్యం ఫోన్‌ చేసి చెప్పాడు. నేను సూరత్‌నుంచి రెండురోజులక్రితమే వచ్చేసినా గోపాల్‌ని కలవలేకపోయాను.

 

ఇప్పుడేమైందో వాడికి. కొంపదీసి...!కంగారుగా భద్రయ్యగారింటికెళ్లాను. ఇంటిముందు గుమిగూడిన జనం. గుండె ఝల్లుమంది. జనాన్ని తప్పించుకుని గోపాల్‌ ఉంటున్న గదిలోకి వెళ్లాను.లోపలికి అడుగు పెడుతూనే నిర్ఘాంతపోయాను.సీలింగ్‌ ఫ్యాన్‌కి వేలాడుతున్న తాడు. కిందపడి ఉన్న స్టూలు. గదిమూల దుప్పటికప్పుకుని ముఖం దాచుకున్న గోపాల్‌. ఓదార్చుతున్న భద్రయ్యగారు, సూర్యం.నన్నుచూస్తునే నా వద్దకొచ్చారు భద్రయ్యగారు, సూర్యం. నేను చూసుకుంటా. ఇంక మీరువెళ్లండి. గుమిగూడిన జనాన్ని పంపేయండి అని భద్రయ్యగారిని పంపేశాను. గోపాల్‌ దగ్గరకు వెళ్ళి దుప్పటి తొలగించి చూస్తే ఒళ్లు జలదరించింది.వాడి ఒంటినిండా మశూచి పొక్కుల్లాంటివి ఉన్నాయి. కొన్ని చితిగిపోయి రక్తం స్రవించి అట్టలు కట్టింది. భరించరాని దుర్గంధం. ఘోరతప్పిదం చేసినట్టు కుంచించుకుపోతున్నాడు.సూర్యం సహాయంతో వాడిని బాత్‌రూంలోకి తీసుకెళ్లి ఒళ్లంతా లోషన్‌తో శుభ్రం చేశాను. నెమ్మదిగా నడిపించుకుంటూ వాడిని మంచిమీద పడుకోబెట్టాం. మంచం పక్కనే కుర్చీలు వేసుకుని కూర్చున్నాక సూర్యం చెప్పుకొచ్చాడు.పదిరోజులక్రితం గోపాల్‌ చేతిమీద పొక్కులులేచాయి. మర్నాడే శరీరం అంతా వ్యాపించాయి. దురద, బాధ, కూచోలేడు. పడుకోలేడు. సూర్యం వాడిని డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లి రక్తపరీక్షలు చేయించాడు.