ఫోన్‌ రింగ్‌ అవుతున్న శబ్దానికి మెలకువ వచ్చింది గాంధీకి.‘‘నాకు హ్యాపీ బర్త్‌డే చెప్పండి సార్‌’’ అంటున్నాడు కబీర్‌ అవతలివైపు నుండి.‘‘ఇదేమిటోయ్‌! ఎవరైనా ఎదుటివాళ్లకి బర్త్‌డే విషెష్‌ చెప్పటానికి ఫోన్‌ చేస్తారు. నువ్వేంటి ఉదయాన్నే ఫోన్‌ చేసి నీకు విషెస్‌ చెప్పమంటున్నావ్‌? ఎనీహౌ హ్యాపీబర్త్‌డే టు యు’’ అన్నాడు గాంధీ.

‘‘మీరు త్వరగా ఫ్యాక్టరీకి రండి. మీ నుండి ఆశీర్వాదం తీసుకోవాలి. మిగిలిన విషయాలు మీరు వచ్చాక మాట్లాడుకుందాం’’ అంటూ చేసినంత వేగంగా ఫోన్‌ పెట్టేశాడు కబీర్‌.లేచి కూర్చున్నాడు గాంధీ.అరవై ఏళ్ల వయసులో, ఆత్మహత్యతప్ప మరోమార్గం కనిపించని ఈ పరిస్థితుల్లో మనిషికి అసలు నిద్రపట్టటమే గొప్ప. అలాంటిది ఒకసారి మెలకువ వచ్చాక ఇంకేమీ నిద్రపడు తుంది?కబీర్‌ గురించిన గతం అతని కళ్ళముందు మెదిలింది. కబీర్‌ తన ఫ్యాక్టరీలో పనిచేసే ఒక సామాన్య కార్మికుడి కొడుకు. చిన్నప్పటి నుండి అమితమైన తెలివితేటలున్న స్టూడెంట్‌. అతని తెలివితేటలసంగతి తెలుసుకున్న గాంధీ అతను చదువుకోవటానికి సాయం చేశాడు.

ఐ.ఐ.టిలో సీటు వచ్చినా హాస్టల్‌లో పెట్టటానికి డబ్బులు లేకపోతే అవి కూడా తనే ఇచ్చాడు. దానికిప్రతిగా ఎన్నో పెద్దపెద్ద ఆఫర్లు వదులుకుని ఇక్కడ తన ఫ్యాక్టరీలో చేరాడు కబీర్‌. క్రమంగా తన కుడిభుజంలా మారాడు.లేచికూర్చున్న గాంధీకి గోడమీద క్యాలెండర్‌లో ఆరోజు తారీఖు కనిపిస్తోంది. అక్టోబర్‌ రెండు. గాంధీ పుట్టినరోజు. గాంధీగారి పుట్టినరోజున ఆయన పేరుమీద పెట్టిన తన ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఎలా ఉండగలడు? అందుకే తను తన మరణాన్నికూడా ఒకరోజు వాయిదా వేసుకున్నాడు.గాంధీ షుగర్‌ ఫ్యాక్టరీ అంటే ఆ జిల్లాలోనే కాదు, రాష్ట్రం మొత్తంమీద పెట్టింది పేరు. అతను ఆ ఫ్యాక్టరీ పెట్టిన తరువాత అనేక ఫ్యాక్టరీలు అతన్ని అనుకరిస్తూ ఏర్పడ్డాయి. కొన్ని నిలదొక్కుకున్నాయి. కొన్ని మూతబడ్డాయి. అతని ఫ్యాక్టరీ మాత్రం ఏనాడూ ఎటువంటి ఒడి దొడుకులు లేకుండా ఇప్పటివరకు తన ప్రస్థానం కొనసాగించింది.