ఏడాది తర్వాత ఇంటికి వచ్చిన బాలయ్యను చూద్దామని వచ్చాడు నారాయణ. అసలే బక్కగా కట్టెపుల్లలా ఉండే మనిషి మరీ బక్కగా చీపురుపుల్లలా మారడం చూసి ఆశ్చర్యపోయాడు.ఇద్దరూ మాటల్లో ఉండగా తలుపు చప్పుడైంది. ఎవరా అని అటు దిక్కుచూశారు. ఎదురుగా ఎల్లం.

‘‘ఇంతకుముందు మాట్లాడినప్పుడు నా ఫోన్‌ నంబరు ఇచ్చుడు మరచిపోయిన. ఏ విషయం ఫోన్‌ చేసి చెప్పు. నువ్వు ఊ అంటె రెండులక్షల రూపాయలిత్త...’’ అంటూ ఓ కాగితం ముక్క ఇచ్చి వెళ్ళిపోయాడు.రెండులక్షలనగానే ఉలిక్కిపడ్డాడు నారాయణ. ‘‘ఒరే బాలుగా, జెట్టన ఊ అనురా. రెండులక్షలంటే మాటలా...నీ బతుకే మారిపోతది. అప్పులన్ని తీరిపోతయి. దరిద్రమే పోతది’’ అన్నాడు.బాలయ్య ఉదాసీనంగా చూశాడు.‘‘ఎవలురా వాళ్లు, కానీకి కొరగాని నీకు అంతడబ్బు ఎందుకిత్తనంటున్నరు...’’ అడిగాడు నారాయణ.బాలయ్య చిన్నగా నవ్వి ‘‘ఏం జరిగిందో చెబుతాను. నేనే నువ్వైతే ఏం చేసేవాడివో చెప్పు’’ అంటూ మొదలుపెట్టాడు బాలయ్య. గరిశలగడ్డ దాటి ముందుకు వచ్చిన పాత స్కూటర్‌ బండి కోట కాలువ దగ్గర ఆగింది.

బండిమీదున్న దేవరాజు అనుమానంగా అటూ ఇటూ చూసి ఎదురుగా వచ్చిన వ్యక్తిని అడిగాడు.‘‘అవన్నా...ఇదేవూరు..’’అతడు దేవరాజును కిందా మీదా చూసి, ‘‘నువ్వేవూరు పోవాలె’’ ఎదురు ప్రశ్న వేశాడు.చెప్పక తప్పదన్నట్టు ‘‘మల్లారెడ్డి’’ అన్నాడు.అతడు వాదనకు దిగుతున్నట్టుగా ‘‘మల్లారెడ్డి అంటే ఏ మల్లారెడ్డి, పెద్ద మల్లారెడ్డా, కంచర్ల మల్లారెడ్డా, భీముని మల్లారెడ్డా...’’అడిగాడు.‘‘ఏ... భీముని మల్లారెడ్డే...’’ అన్నాడు దేవరాజు.‘‘ఆఁ సరిగ్గనే వచ్చినవు. ఇదే. ఎవలింటికి పోవాలే..’’ అడిగాడు.‘‘ఆఁ అదే గా బాలయ్య ఇంటికి’’‘‘బాలయనా, ఏ బాలయ, బీర బాలయనా, బెత్త బాలయనా, నారం బాలయనా...’’ అంటుండగానే అందుకున్నాడు దేవరాజు. ‘‘ఓ అన్నా, ఆగాగు, ఊరోళ్ళందరి పేర్లూ సదవకు, గా బక్కబాలయ్య ఇంటికి పోవాలె, ఎటుంటది?’’