ఎలుకలతో కళకళలాడిపోతోందాఊరు. అక్కడ డాక్టరు ఎలుకని ఫీజుగా పుచ్చుకుంటారు! సరసమైన ధరలకే అక్కడ ఎలుకల్ని అమ్ముతారు. స్కూళ్ళల్లో పోటీలుపెట్టి విద్యార్థులకు పందికొక్కులు, ఎలుకలు, చిట్టెలుకల్ని బహుమతులుగా ఇస్తారు. అక్కడ బంధువులిళ్ళకెవరూ వట్టి చేతులతో వెళ్ళరు. ఆడవాళ్ళకి బొట్టుపెట్టి రవికెలగుడ్డ బదులు ఎలుకనిచ్చి పంపుతారు! ఏమిటీ ఉల్టాపల్టా? అసలు ఆ ఊళ్ళోవాళ్ళకేమైంది?

‘‘పొద్దున్న పొద్దున్నే అప్పుకొచ్చానని ఏమీ అనుకోకు వదినా! ఓ ఎలకుంటే ఇస్తావా, రేపు బోన్లో పడగానే ఇచ్చేస్తా!’’‘‘చాల్లేవమ్మా! మొన్న పట్టుకెళ్ళిన పందికొక్కుకు దిక్కులేదు మళ్ళీ ఎలక్కావాలా ఎలకా? మాకు మాత్రం ఇట్టిట్టే పడిపోతున్నాయా బోనుల్లో? పాతబాకీ తీర్చకుండా మళ్ళీ అప్పుకెలావస్తారమ్మా?’’‘‘అంతమాటనకొదినా! ఎలక్కాపోతే పోనీ ఓ చుంచునన్నా ఇవ్వు! నీ బాకీ బోనుల్లోపెట్టి తీర్చేస్తా! మా ఖర్మ కాకపోతే, రోజూ చక్కగా నేతిబజ్జీలు పెడుతున్నామమ్మా ఎరగా! ఒక్కటంటే ఒక్కటి పడట్లేదు. పడితే అడుగుతానా చెప్పు! పొద్దుట్నించి మీ అన్నయ్య ఎగస్వాస దిగశ్వాసగా ఉన్నారు. డాక్టరు దగ్గర కెళ్ళాలి. ఎలక లేకుండా డాక్టరు దగ్గరకెలా వెడతాం చెప్పు!’’. డాక్టరు దగ్గర కెళ్ళడానికి ఒంట్లో జబ్బుండాలి! జేబులో డబ్బుండలి! మరి ఎలకుండటమేమిటీ అని ‘డవుటు’ వస్తే గతంలోకి వెళ్ళాలి.సరిగ్గా రెండేళ్ళ క్రితం డాక్టరు దుందుభి అమెరికానించొచ్చి ఆ ఊళ్ళో ప్రాక్టీస్‌ పెట్టాడు.

మొదట్లో పేషంట్లు ఎక్కు మంది వచ్చేవాళ్ళు కాదు. అమెరికా డాక్టరని పేరు బాగా ప్రచారం అయ్యేసరికి ప్రాక్టీస్‌ ఊపందుకుంది!మొదట్లో పడిశం, దగ్గు, జ్వరాలకు మాత్రమే వైద్యం చేసేవాడు దుందుభి. తర్వాత తర్వాత అన్నిరోగాల వాళ్ళూ రాసాగేరు. దాంతో మోకాళ్ళ నొప్పులూ, బీపీ, షుగరూ, గుండె నొప్పులకూ, కీళ్ళవాపులూ, ఆర్ష మొలలూ, వరిబీజం...ఇలా అన్ని జబ్బులకు వైద్యం చెయ్యసాగేడు.మందులకోసం పాపం పేషంట్లు మళ్ళీ టౌనుకేం వెడతార్లే అని వాటిని కూడా తనే తెచ్చి స్టాకుపెట్టి పెద్దగా లాభం వేసుకోకుండా అమ్మసాగేడు. అలా కొద్దిరోజులుపోయాక పోనీ మందులుకూడా మనమే తయారుచేసి అమ్మితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అతడి జీవితాన్ని మార్చింది!అమెరికాలో రేట్సన్‌ అని ఓ ఫ్రెండున్నాడతనికి. అతడి వద్ద నించి మందు పౌడర్లు, నూనెలు తెప్పించి వాటితో మందుల తయారీకి ఉపక్రమించాడు. తయారైన మందులు ఎలా పని చేస్తున్నాయో పరీక్షించాలి.