శృంగారపురాన్ని పాలించే శంఖచూడుడు, అనేక రాజ్యాల మీదికి దండెత్తి, లెక్కకు మిక్కిలిగా వజ్ర వైడూర్యాలనూ, మరకత మాణిక్యాలనూ, బంగారాన్నీ సంపాదించాడు. వాటిని భద్రపరిచేందుకు ధనగృహాన్ని నిర్మించ తలపెట్టాడు. పేరుమోసిన తాపీమేస్త్రీ బంధుడును పిలిచాడు. ఊరికి దూరంగా అభేద్యమైన ధనగృహాన్ని నిర్మించమని ఆదేశించాడతనికి. సరేనని, కుమారుడు మధుడుసహా ధనగృహాన్ని నిర్మించాడు బంధుడు. ఎవరికీ తెలియని విధంగా, ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ధనగృహంలో ప్రవేశించేందుకు, తిరిగి వచ్చేందుకు ఓ బండను గోడలో ఏర్పరిచి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశాడతను. పూర్తి అయిన ధనగృహాన్ని అన్ని వైపులా, అనేక రకాలుగా పరిశీలించి, పరిశోధించి, బాగున్నదని తృప్తి చెందాడు శంఖచూడుడు. బంధుడికీ, అతని కొడుక్కీ రెండింతలుగా కూలీ చెల్లించి, వారిని పంపించి వేశాడు. తర్వాత సంపాదించిన ఆస్తినంతటినీ బండ్ల ద్వారా ధనగృహానికి చేరవేసి, తాళాలు బిగించాడు. కాపలాగా పాతిక మంది భటులను నియమించాడు.కొద్దిరోజులు గడిచాయి.

ధనగృహాన్ని ఎవరూ కన్నెత్తి చూడడం లేదని, దోచుకునే అవకాశం అంతకన్నా లేదని తెలిశాక, అక్కడి నుంచి భటులను వెనక్కి పిలిపించాడు శంఖచూడుడు. అదంతా గమనించాడు బంధుడు. ఎప్పుడైతే భటులు వెనక్కి వెళ్ళిపోయారో ఆ రాత్రి కొడుకు మధుడుసహా ధనగృహానికి బయల్దేరాడు బంధుడు. కూడా గోనెసంచిని తీసుకుని వెళ్ళాడు. ధనగృహాన్ని సమీపించాడు. దాని గోడకి గల బండను తొలగించి, కొడుకుసహా లోనికి ప్రవేశించాడు బంధుడు. బంగారు వరహాలు కుప్పబోసి ఉన్నాయి అక్కడ. గోనెసంచి నిండుగా నింపుకున్నాడు వాటిని. వెను తిరిగి వచ్చాడు. కన్నం ఎలా వేసిందీ ఎవరూ గుర్తించలేని విధంగా బండను యథాప్రకారం గోడకి ఏర్పరిచి, కొడుకు సహా ఇంటిదారి పట్టాడు బంధుడు.మర్నాడు శంఖచూడుడు భటులతో ధనగృహానికి చేరుకున్నాడు. దాచిన ధనం అంతా ఉన్నదీ లేనిదీ పరిశీలించసాగాడు. ఆ పరిశీలనలో బంగారువరహాల రాశి తరిగి ఉండడాన్ని గమనించాడు.‘‘దొంగతనం జరిగింది. ఎలా జరిగింది?’’ ఆందోళన చెందాడు.‘‘లేదు మహారాజా! ఇంత గట్టి కట్టడాన్ని ఛేదించుకుని లోపలికి దొంగ ప్రవేశించడం అసాధ్యం. దొంగతనం జరగలేదిక్కడ.’’ చెప్పారు భటులు.దొంగతనం జరగలేదా? జరిగినట్టు తనకి అనిపిస్తోందే? తర్జనభర్జన పడ్డాడు శంఖచూడుడు. ఊరుకున్నాడు అప్పటికి.