‘‘మన మేకలం అంతాకలిసి సంఘం పెట్టుకున్నాం కదా? అలాగే పులులు కూడా ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకుంటే తప్పేమిటి?’’ మేకపిల్ల భయపడుతూనే తండ్రి పెద్ద మేకపోతుని అడిగింది.

మేకపోతు గంభీరంగా గడ్డం నిమురుకుంటూ - ‘‘పులులకి సంఘంలేదని ఎందుకనుకుంటున్నావు? మన సంఘం నిన్నగాక మొన్న పుట్టింది. వాళ్ల సంఘం చాలా పాతది. అసలు సంఘం అంటేనే పులులు, పులులంటేనే సంఘం.’’మేకపిల్లకి కొంచెం బోధపడిందిగానీ కొత్త సందేహాలు కలిగాయి. తన పెద్దపెద్ద కళ్లతో తండ్రికేసి చూసింది.మేకపోతుకి ఈ విషయం గురించి ఎక్కువగా చర్చించడం ఇష్టంలేదు - పిల్లలకి ఇవన్నీ ఇప్పుడే ఎందుకులే అని. ఈ వయసులో చదువు ముఖ్యం కదా! చదువుకొనే అవకాశం - మేకపిల్లలికీ, పిల్లగొర్రెలకీ ఈ మధ్యనే ఏర్పడింది. అందుకుగాను ఎన్నాళ్లు పోట్లాడవలసి వచ్చింది?! ఇప్పటికీ కొన్ని పెద్దపులులు అడ్డుకుంటూనే ఉన్నాయి, ‘మీ మొహాలికి చదువు కూడానా?’ అని వెక్కిరిస్తూనే ఉన్నాయి. అయితే చదువులో మేకలూ, గొర్రెలూ కూడా బాగా రాణిస్తున్నాయి. గొర్రెలు ఏకసంధాగ్రాహులు; ఒక పాఠ్యాంశంపై దృష్టి పెట్టాయంటే ఇక అటూ - ఇటూ చూసే ప్రసక్తేలేదు. మేకలు సృజనాత్మకతకి మారుపేరుగా అవతరించాయి; వాటి ధారణ శక్తి అమోఘం.

ఈ మార్పులను గుర్తించని పులుల సంఖ్య మాత్రం ఇంకా బలంగానే ఉంది.‘పులులకు కూడా సంఘం!’ మేకపోతుకి నవ్వొచ్చింది. ఈ ప్రశ్న మేకపిల్లకి స్వతహాగా తోచిందంటే నమ్మకం కుదరడం లేదు. స్కూల్లో ఏ పులిపిల్లో బుర్రలో పెట్టి ఉంటుంది. అయిష్టంగానే మళ్లీ నోరు విప్పింది -‘‘ఇప్పుడంటే ఇన్ని ఊళ్లు వచ్చాయిగానీ, పూర్వం అంతా అడివే. అడివిలో పులుల మాటే చెల్లుతుంది గానీ మేకలు ‘మే, మే’ అని ఎంత గీపెట్టినా ఎవరు వింటారు? మరీ ఎక్కువగా అరిస్తే పులులొచ్చి మీద పడతాయి. అసలు మరొకరి మాట పులులు వినాలని అవీ అనుకోలేదు; మన పెద్దవాళ్లూ అనుకోలేదు. ఎన్నో తరాలపాటు పులుల దౌర్జన్యం కొనసాగుతూ వచ్చింది. విసిగిపోయిన మేకలూ, గొర్రెలూ మరో మార్గంలేక న్యాయం కోసమని సంఘం పెట్టుకున్నాయి. అప్పటినుంచీ గొర్రెలు కసాయిని నమ్మడం మానేశాయి; మేకలు బక్రాలు కావడం ఆగిపోయింది. దాంతో పెద్దపులులు - మేకలకీ, గొర్రెలకీ మధ్య ఎలాగైనా చిచ్చుపెట్టాలనీ, మన సంఘాన్ని చీల్చాలనీ చాలా కుట్రలూ, దుర్మార్గాలూ చేశాయి, చేస్తున్నాయి.’’