మనిషికి పరధ్యానం ఉంటే అలవికాని అనర్థాలొస్తాయి. కానీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే మరిన్ని సమస్యలొస్తాయి. ఈ కథలో ఇలాంటి కష్టాలే వచ్చాయి ఓ యువకుడికి. తన పరధ్యానం భార్యకు తెలియకూడదనీ, ఆమెకు లోకువకాకూడదనీ భావించి అతిగా ప్రవర్తించాడు. కోరికష్టాలు తెచ్చుకున్నాడు. దానివల్ల అతడు ఊళ్ళో అందరితో గొడవలు పడాల్సివచ్చింది పాపం!

ఒక గ్రామంలో సీతారామయ్య అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. ఊళ్లో చాలామందికి అతడే పురోహితుడు. ఊరందరూ అతణ్ణి ఎంతో గౌరవంగా చూసేవారు. సీతారామయ్యకు పరధ్యానం ఎక్కువ. అది అలుసుగా తీసుకుని చాలామంది తనను మోసం చేస్తున్నారని అతడి అనుమానం, ఆ అనుమానమే అతణ్ణి కోపిష్టిగా మార్చింది.ఇటీవలే సీతారామయ్యకు పెళ్ళైంది. అతడి భార్య రమణమ్మ నెమ్మదస్తురాలు. తెలివైనది. భర్తను గౌరవించేది. కానీ, సీతారామయ్యకి తన భార్యమీద అనుమానం. తన పరధ్యానం విషయంతెలిస్తే ఆమె తనని లోకువ చేస్తుందని అతడి ఉద్దేశం. ఆమెకు లోకువ కాకుండా ఉండడానికి ఆమెను మొదట్నించీ అదుపులో ఉంచాలనుకున్నాడు. అందుకని రమణమ్మవల్ల గోరంత తప్పు జరిగినా దాన్ని కొండంతచేసి పెద్ద రభస చేసేవాడు.

రమణమ్మ ఎదిరించేది కాదు. ‘‘కాస్త నవ్వుతూ మాట్లాడండి. లేకపోతే, మిమ్మల్ని చూడగానే భయమేస్తుంది’’ అనేది. ఆమె అలా అన్నప్పుడల్లా, ‘‘నవ్వుతూ ఉండాలని నాకూ ఉంటుంది. కాని నువ్వలా ఉండనివ్వటంలేదు’’ అని దానిక్కూడా భార్యనే తప్పుపట్టేవాడు సీతారామయ్య.భర్త ధోరణి అర్థంకాక రమణమ్మ సతమతమైపోయేది. అతడి కోపం పోగొట్టడం తనవల్ల కాదని చివరికామె గ్రహించి, రోజూ దేవుడికి దణ్ణం పెట్టుకునేది- ఎలాగో అలా భర్త కోపం తగ్గించమని. రోజులు గడిస్తున్నాగానీ సీతారామయ్య కోపం తగ్గడం లేదు.

భర్తకు ఎప్పుడు కోపం వస్తుందోనన్న భయంవల్ల కంగారుపుట్టి అప్పుడప్పుడు అమెవల్ల నిజంగానే పొరపాట్లు జరుగుతూండేవి. పొరపాటు జరిగినప్పుడల్లా సీతారామయ్య కాలరుద్రుడై పోయేవాడు. ఒక రోజున రమణమ్మ భోజనసమయంలో నెయ్యి బదులు నూనె వడ్డించింది. సీతారామయ్యకి నూనె అంటే పడదు. అతడో ముద్ద కలుపుకుని నోట బెట్టుకుని. ‘‘ఏమిటిది? వంట ఇలా తగలడింది’’ అన్నాడు కోపంగా.