శివసతీపురం చిన్న రాజ్యం. అంతా కలిపి ఓ వెయ్యి గడప ఉంటుందంతే! ఆ రాజ్యానికి రాజు ఉత్తముడు. అతనికి ఓ కూతురు. ఆమె పేరు జయంతి. అందంగా సన్నగా బాగుంటుంది జయంతి. ఆమె జుత్తు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. గులాబీలంటే ఆమెకు చాలా ఇష్టం. గుత్తులు గుత్తులుగా గులాబీలను ముడుచుకుంటుందామె. గులాబీ రేకులను పరుచుకునిపడుకుంటుందామె. గులాబీలు లేనిదే ఉండలేదామె. అందుకనే రాజ్యంలో అందరూఆమెను ‘గులాబీ సుందరి’ అని కూడా పిలుస్తారు.సూర్యాస్తమయం అయితే చాలు! జయంతి అంతఃపుర కిటికీ దగ్గరగా నిల్చుని చప్పట్లు కొడుతుంది. ఆ చప్పట్లకి ఎక్కణ్ణుంచి వస్తుందో తెలియదు, అందమైన బంగారుపిచ్చుక వచ్చి ఆమె భుజం మీద వాలుతుంది. పిచ్చుక వచ్చి వాలడం ఆలస్యం, జయంతి బంగారు జుత్తు మరింత ప్రకాశవంతం అవుతుంది. వెయ్యిదీపాలకాంతిలా వెలిగిపోతుంది. ఆ కాంతిని చూస్తూ బంగారుపిచ్చుక గొంతు సవరించుకుంటే, ఆ గొంతులో శృతి కలుపుతుంది జయంతి. అందమైన పాట పాడతారిద్దరూ.

ఆ పాట వింటూ రాజ్యంలోని ప్రజలంతా నిద్రపోవడం అలవాటు.జయంతి, పిచ్చుకల పాట వింటూ నిద్రపోతే తెల్లార్లూ మంచి మంచి కలలు వస్తాయి. మంచి మంచి కలలు రావడమే కాదు, ఆ కలలు నెరవేర్చు కునే శక్తియుక్తులు కూడా వస్తాయి. అందుకని గులాబీసుందరి పాటకోసం ఒళ్ళంతా చెవులు చేసుకుంటారు ప్రజలు.జయంతికి ఆరేళ్ళు వచ్చిన దగ్గర నుంచీ పాడుతోందిలా. ఇప్పుడు ఆమెకు పదహారేళ్ళు. గత పదే ళ్ళుగా రాజ్యంలోని ప్రజలకి పీడకలలంటే తెలీవు. నిద్రలేమి అన్నది కూడా లేదు. హాయిగా ఆనం దంగా రోజులు గడిచిపోతున్నాయి.ఎప్పటిలాగే పిచ్చుక-జయంతి పాట పాడుతున్నారు ఓ రోజు. ఆ పాట ఊరవతల మర్రిచెట్టు కింద ఉన్న మంత్రగత్తెకు వినవచ్చిందీసారి. పాట తియ్యగా హాయిగా ఉంది. మనసు దోచేసింది. దాంతో మంత్రో చ్చారణ మీద ధ్యాసను కోల్పోయిందామె. అప శబ్దాలు పలక సాగింది. మంత్రోచ్చారణలో అప శబ్దాలు దొర్లడంతో మంత్రం వికటించింది. పిశాచి ప్రత్యక్షమైంది. హింసించసాగిందామెను. ఆ హింసను తట్టుకోలేకపోయింది మంత్రగత్తె. పాడింది ఎవ రన్నది తెలుసుకునేందుకు కళ్ళు మూసుకుంది. జయంతి కనిపించిందామెకు. కోపం కట్టలు తెంచుకుంది. శపించిందిలా.