సూర్యాపురంలో ధన్వంతరి అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు. ఆయన నిత్యం ఆయుర్వేద గ్రంథాలు అధ్యయనం చేస్తూ, కొత్త మందుల్ని అన్వేషిస్తూ ఎన్నో కొత్తరోగాలకు చికిత్స కనిపెట్టాడు. భార్యంటే ఆయనకు ఆరవప్రాణం. ఒకసారి తన భార్య పద్మావతికి ఉన్నట్లుండి జబ్బుచేస్తే రోగ లక్షణాలనుబట్టి ఆమెకొచ్చిన జబ్బేమిటో నిర్ధారణ చేయలేకపోయాడు. దాంతో ఆమె ఆరోగ్యం గురించి బెంగపెట్టుకున్నాడాయన.

ఆ సమయంలో ధన్వంతరివద్దకు రామానుజుడనేవాడొచ్చాడు. వాడి భార్యకు ఏదో తెలియని జబ్బు చేసిందిట. ఏ వైద్యునివద్దకు వెళ్లినా, ఆ వ్యాధి లక్షణాలు విని, ‘‘ఈ రోగంగురించి ఏ వైద్యగ్రంథంలోనూ వ్రాసిలేదు. నీ అదృష్టం బాగుంటే ఈ జబ్బు దానంతటదే నయమవుతుంది’’ అని చెబుతున్నారుట. ధన్వంతరి అతడితో, ‘‘ప్రస్తుతం నా మనసేమీ బాగోలేదు’’ అంటూ తన భార్య పరిస్థితి చెప్పాడు. రామానుజుడది విని, ‘‘నా భార్య కూడా సరిగ్గా ఇదే జబ్బుతో బాధపడుతోంది. ఒకవిధంగా ఇది నా అదృష్టం. తమరు శ్రద్ధపెట్టి ఒక్కసారి ఆయుర్వేద గ్రంథాలు తిరగేసి చూడండి. తప్పక ఉపాయం కనబడుతుంది’’ అన్నాడు.మరో స్త్రీ కూడా అదే జబ్బుతో బాధపడుతోందని తెలియగానే ధన్వంతరికి పట్టుదల వచ్చింది.

ఆయన మరొక్కసారి తనవద్దనున్న వైద్యగ్రంథాలన్నీ తిరగేస్తే, ఎక్కడా పద్మావతి వ్యాధి లక్షణాలు కనపడలేదు. కానీ అపూర్వ రోగాల్ని చర్చించిన ‘పార్వతీకళ్యాణం’ అనే ఓ పురాతనగ్రంథం ప్రస్తావన ఉంది.ఆ గ్రంథం సూర్యాపురం గ్రామాధికారి ఇంట్లో ఉన్నట్లు ధన్వంతరికి తెలుసు. ఇంతకాలం అది వైద్యగ్రంథం కాదనుకున్న ఆయనకి అందులో వైద్యం ప్రసక్తి ఉందని ఇప్పుడే తెలిసింది. వెంటనే గ్రామాధికారి ఇంటికివెళ్లి ఆ గ్రంథం తెచ్చుకుని శ్రద్ధగా చదివాడు.

అందులో కథ ప్రకారం, హిమవంతుడి కుమార్తె పార్వతి చెలికత్తెలకి కొత్తరకాల జబ్బులు చేస్తాయి. పార్వతి ఒకొక్కరి వ్యాధికీ, ఏయే మందులు ఎలా తయారుచేసి ఎలా వాడాలో చెబుతుంది. ఆ మందులు వాడి పార్వతి చెలికత్తెలందరూ రోగ విముక్తులవుతారు. అలా ఆ గ్రంథంలో పన్నెండు అపూర్వ వ్యాధుల వివరాలున్నాయి. వాటిలో పద్మావతి జబ్బు వివరాలూ ఉన్నాయి. అయితే మందు తయారీ విషయంలో ఒక సమస్య ఉంది. ఎక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా ఆ మందు విషమైపోతుంది!