‘‘యీ నునులేత మునివేళ్ళు సున్నితంగా తాకితే...తాకిన చోటల్లా కలువల సరస్సుల్లా స్వేదరంధ్రాలు విచ్చుకొని...నా మునివేళ్ళ నుండి గుండెకు అపురూపమైన తంత్రుల్ని బిగించినట్టుండేది...’’పాడ్‌ కాస్ట్‌ని వింటూ వుదయపు యెండకి గదిలోని కిటికీ పక్కన కూర్చొని అదే పనిగా యెదురుగా వున్న మెయిన్‌ రోడ్డుని చూస్తూ లెమన్‌ టీ సిప్‌ చేస్తోన్న సంజనా వొకసారి తన మునివేళ్ళని చూసుకుంది. 

చేతిలోని కప్పుని కిటికీ పక్కన పెట్టి రెండు అరచేతుల్నీ వొకసారి రుద్దుకుంది.‘యీ వేళ్ళు యింకా అలానే మిగిలున్నాయా?’ అనుకుంటూ మళ్ళీ రోడ్డుని చూసింది. రోడ్డంతా పూర్తిగా ట్రాఫిక్‌తో నిండుంది. ‘యీ రోడ్డు మళ్ళీ గత సంవత్సరపు నిర్మానుష్య రోడ్డులా మారబోతుందా?! చాలామంది అంటున్నట్టు మూడో వేవ్‌ వస్తుందా?! మళ్ళీ లాక్‌డౌన్‌ వస్తుందా?!’ఆమె పెదవులపై అద్దుకున్న గాఢమైన గులాబీరంగుపై హై చీక్స్‌ మీద వొక్క స్ర్టోక్‌ వేసిన లేత గులాబీ రంగు మెరుస్తోంది. ఆ పైన చిన్న గవ్వలలాంటి కళ్ళ నిండుగా తీర్చిదిద్దిన నల్లని కాటుకపై దిగులు రంగు వొత్తుగా కమ్ముకుంటుంటే ‘యీ వుదయపు అనివార్యమైన లీజర్‌, రేపటి వుదయపు హడావుడి కాబోతుందా?!’ లేక యీ లీజరే మరిన్నాళ్ళు కొనసాగబోతుందా?!’ప్రశ్నలే. సమాధానాల్లేవ్‌.

యెక్కడ సిలిగురి? యెక్కడ హైదరాబాద్‌?మన వూరి నుంచి బయటకు అడుగేయకపోతే బతుకులో యెదుగుదల వుండదనుకొని సంజనా, ఆమె పెద్ద తమ్ముడు కలిసి మారుమూల సిలిగురి నుంచి హైదరాబాద్‌కు వలస పక్షుల్లా యెగిరొచ్చారు. తమ ప్రాంతం నుంచి తమకంటే ముందొచ్చిన వాళ్ళ సహాయంతో పనుల్లో కుదురుకోవడం పెద్ద కష్టం కాలేదు. తాను ‘లీనా’ బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా జాయిన్‌ అయింది. తమ్ముడు దామూ చైనీస్‌ రెస్టారెంట్‌లో పనికి కుదిరాడు. ‘లీనా’ బ్యూటీపార్లర్‌ సిటీలోనే పేరున్నది. అత్యంత సంపన్న వర్గాల నుంచీ మధ్య తరగతి వరకు యెంతో ఆదరణ వున్నది. దాని యజమాని ‘లీనా’ అత్తగారు బాంబే ముంబాయ్‌గా మారక ముందు సిటీకి వచ్చి స్థిరపడి ... అధునాతన సౌకర్యాలతో యేర్పాటు చేసిన పార్లర్‌ యెంతో మంది టెక్నీషియన్‌లకు వుపాధి కల్పించింది. యెప్పటికప్పుడు యీ రంగంలో వస్తోన్న ప్రతీ కొత్త పరికరాన్ని, ట్రీట్మెంట్‌ని పార్లర్‌లో సమకూర్చేది లీన. అందరిలోనూ సీనియర్‌ అయిన సంజనాని మాత్రమే లాక్‌ డౌన్‌ అయ్యాక పనికి పిలిచినా సంజనాకీ పనిలేదు.