పండగ సీజన్‌ మొదలైంది. పేషెంట్లు తగ్గారు. ఖాళీ దొరికింది కదా అని సిస్టర్స్‌ని వెంటేసుకుని షాపింగ్‌కి వెళ్లింది నందిని.నాకూ ఆటవిడుపే!‘‘భలే ఛాన్సులే! లక్కీఛాన్సులే లలలాం...లలలాం...లక్కీ ఛాన్సులే!!’’ విజిలేసుకుంటూ రీడింగు రూంలో దూరాను.‘‘నో నాగమణీ ఎంజాయ్‌! రాసుకోవచ్చూ, చదువుకోవచ్చూ, పాటలువినొచ్చు, పాటలు నోరారా పాడుకోనూవచ్చు. ‘ఎవరికీ తలవంచకు..ఎవరినీ ఆశించకు...’ నా హడావిడి చూసి కంగారుగా వచ్చింది సుగుణమ్మ.

‘‘ఏమైందయ్యా?’’ అన్నట్టుగా చూసింది.రెండు బుగ్గలమధ్య నాలుకను లొటలొటా ఆడిస్తూ ‘ఎబ్బే! ఏం లేదు’ అన్నట్టుగా తలూపాను.నేను చేసే ఇలాంటి కొంటెపనులు ఆమెకు బాగా తెలుసు.‘ఊఁ’ అని ఒక నిట్టూర్పు విడిచి వెళ్లిపోయింది.సుగుణమ్మ నాకు దూరపు బంధువు. మేనత్తవరస. భర్తపోయినాక ఊర్లో ఒక్కత్తే ఉంటే మా చిన్నబాబు పుటకలకు తీసుకొచ్చా. నందినికి తోడుంటూ ఇద్దరబ్బాయిల్ని సాకిందావిడే! మాకు షాక్‌ అబ్జార్బర్‌. మా ఇంటి పెద్దదిక్కు. వచ్చిన కొత్తలో ‘నేనీడుండలేను వెళ్లిపోతానని’ అలిగి ఊరు మీద దిగులేసుకుంది. ఆమెతో మాట్లాడ్డానికెవరూ ఉండేవారుకాదు. ఖాళీ దొరికినప్పుడల్లా నేనే ఊరు కబుర్లు అడిగి ఆమె దిగులు పోగొట్టేవాణ్ణి. ఊర్లో అందరి గురించి తెలుసు.

రోటి పచ్చళ్ళు బాగా చేస్తుంది. పుస్తకాలు వెదుకుతున్న నాకు అయస్కాంతంలా ‘చివరి గుడిసె’ చిక్కింది.‘‘రాజుబాబూ!’’ అంటూ మంచినీళ్ల గ్లాసుతో వచ్చింది సుగుణమ్మ.తాగి ఖాళీగ్లాసు చేతికిస్తుంటే, ‘‘నందినమ్మ వీళ్లని తీసుకుని బయటికెళ్లినట్టుంది?’’ అడిగింది.‘‘పండగ్గా! అందరికి బట్టలు తేడానికెళ్లిందిలే!’’‘‘నాకీపాలి రెండుకోకలు కావాలబ్బాయ్‌. మునుపటిలా ఒకటీ అరా ఇత్తే తీసుకోను’’ అంది బుంగమూతిపెట్టి.‘అలాగే’ అన్నట్టు తలూపాను పుస్తకంలోంచి దృష్టి మరల్చకుండా.నాతో ముచ్చట్లు పెడదామని వచ్చిందిగానీ, నా మూడ్‌ చూసి వెళ్లిపోయింది. ‘‘ఓసారిలా వస్తారా?’’ భానుమతిలాంటి గొంతు విని లోనికొచ్చా.నందిని సోఫాలో కూర్చుని ఉంది. ఆమె వాలకం చూస్తుంటే బాగా అలసిపోయినట్టుంది. ఎదురుగా బల్లమీద సంచులనిండా బట్టలున్నాయి.