‘‘ప్రతిపదమిదమపి నిగదతిమాధవ ...నిగదతిమాధవ.. నిగదతిమాధవతవచరణే పతితాహం ...త్వయి విముఖే మయి సపది సుధానిధిరపి తనుతే.. తనుదాహంసా విరహేతవదీనా రాధా..సా విరహేతవదీనారాధా..సా విరహే తవదీనా...కృష్ణా... ఆ ...తవవిరహే.. ఏఏఏ.... దీనా...ఆ...’’‘‘ఆకాశవాణి, విజయవాడకేంద్రం. పుష్పాంజలి కార్యక్రమంలో ముందుగా ‘విప్రనారాయణ’చిత్రం నుండి భానుమతిపాడినపాటవిన్నారు. తర్వాత రాబోయేపాట...’’‘‘ఆ నామాలూ, ఆ బొట్టూ ... విప్రనారాయణలో నాగేశ్వర్రావుని చూస్తుంటే ఆకలీ నిద్రా ఉండవ్‌..’’ రోట్లో కొబ్బరి పచ్చడి రుబ్బుతూ అంది సుబ్బలక్షి.

‘‘‘అన్నానని కాదు గానీ, అసలేం చేశాడమ్మా మీ నాగేశ్వర్రావు? అమ్మాయిల వెనక పరిగెట్టడ వూను, కుప్పిగంతులూ తప్ప... నువ్వు కదలకే హేమా, పాపిడి చెదిరిపోతోంది’’ జడరిబ్బను పైకి కట్టి గట్టిగా లాగుతూ అంది మాణిక్యమ్మ.‘‘అబ్బా... జుట్టు పీకేస్తున్నావు. కొంచం మెల్లిగా వెయ్‌ మామ్మా...’’‘‘ఊఁ ..’’‘‘మీ రామారావు మాత్రం.. రాముడు, కృష్ణుడు వేషాలెయ్యడం తప్ప ఇంకేం చేసాడు? పాపం, జబ్బలు వాచిపోయేవట పక్కనున్న వాళ్లకి... పైగా, డాన్సు చేస్తే అందరి కాళ్ళు తొక్కేసేవాడట...వొట్టి బండ మనిషి.’’‘‘అమ్మమ్మా రెండ్రుపాయలివ్వా..’’అడిగాడు వంశీగాడు.‘‘పోరా.. నా దగ్గర్లేవు’’ విసుక్కుంది.‘‘ఏవండీ... ఆ పేపర్‌ చదవడం అయిపోతే ఆ చిన్నాడిని మీతో పాటు స్నానానికి తీసుకెళ్లండి. వాడొక్కడే వెళ్తేసబ్బు మొత్తం బుడగలు చేసి అరగదీసేస్తాడు’’ వంటింట్లో ఓ మూల ఉన్న దేవుడికి చిన్న ఆకులో బెల్లం నైవేద్యం పెడుతూ అంది రాధ.‘‘ఆఁ ...’’‘‘నాన్నగారూ .. రెండురూపాయలివ్వరా?’’‘‘చిల్లర లేదురా.. అమ్మదగ్గరుందేమో అడుగు.’’‘‘అమ్మా... ఇడ్లీకి డబ్బులివ్వే.’’‘‘ఇస్తాగానీ ఈ పాలు చెల్లికిచ్చేసిరా.’’పాలు ఇచ్చి వచ్చేసరికి ఒకగిన్నె, దాన్లో మరోచిన్న గిన్నె అందులో రెండురూపాయలు వేసి ఉన్నాయి. అమ్మ వంకచూసి నవ్వి బైటికి పరిగెత్తాడు వంశీ.‘‘ఒరేయ్‌ మెల్లిగా... పడతావ్‌. ఏమేరాధా అలా రోజూ వాడికి డబ్బులివ్వడం ఎందుకే. సుబ్బరంగా చద్దన్నం పెట్టచ్చు కదే. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం...’’‘‘పోన్లేమ్మా. మనం ఎలాగూ రోజూ టిఫిన్లు చెయ్యం కదటే...’’ లోపలనుంచే అంది రాధ, నూతి పళ్లెం దగ్గర పిల్లాడితో కలిసి సబ్బు నురగతో ఆడుతున్న మాస్టారిని కిటికీలోంచి చూసి తనలో తానే నవ్వుకుంటూ.

********************

అగ్రహారంనుంచి నాలుగడుగులేస్తే వెంకన్నబాబు గుడి. పక్కనేకచేరిచావడి, ఎదురుగా ఉన్న పిల్లల గ్రౌండు దాటి సందులోకెళ్తే వరసగా పాకలు, అక్కడక్కడా పెంకుటిళ్ళు ఉన్న గూడెం వచ్చేస్తుంది. ఆ వీధుల పేరేంటో తెలీదు గానీ, ఆ చుట్టుపక్కల చిన్న చిన్న వృత్తులు చేసే వాళ్లంతా అక్కడే ఉంటారు. నాలుగైదు వీధులన్నీ కలిపి గూడెం అంటారు. ఆ గూడెం మొదటి వీధిలో చివర నుండి నాలుగో ఇంటి ముందు ఆగాడు. రెండు వాటాలున్న ఆ ఇంట్లో కుడి పక్క ఇస్త్రీ బండి సూర్యకాంతం, ఎడమ పక్క సూరిబాబు ఉంటారు. సూరిబాబు మెయిన్‌ రోడ్డులో డిగ్రీ కాలేజీ దగ్గర డ్రింకు బండి వేస్తే, వాళ్ళావిడ రత్నం పొద్దున్న ఇడ్లీలు, సాయంకాలం పకోడీలు, బజ్జీలు వేసి ఇంటిదగ్గరేఅమ్ముతుంది.