అంతర్ధానుడు లోహదండపురాన్ని పాలిస్తున్న రోజులవి. అతనికి ఓ కుమారుడు. పేరు అంగుడు. పెళ్ళీడుకొచ్చాడు. అతనికి పెళ్ళి చేసేందుకు రాజు ప్రయత్నాలు చేయసాగాడు. ఆ ప్రయత్నాలు తెలుసుకున్న అంగుడు తండ్రిని సమీపించాడు.‘‘తండ్రీ! నేను ప్రపంచసుందరిని పెళ్ళాడాలనుకుంటున్నాను. మీరు అనుమతి ఇస్తే ఆ సుందరిని వెదుకుతూ నేను ప్రపంచ పర్యటన చేయాలనుకుంటున్నాను.’’ అన్నాడు. సరేనన్నాడు తండ్రి.అంగుడు అంతఃపురం వీడాడు. విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. గుర్రం మీద ప్రయాణించి ప్రయాణించి అలసిపోయాడు. దాహంగా ఉందతనికి. నీరు తాగేందుకు ఓ కొలను గట్టుకు చేరుకున్నాడు. దోసిటతో నీరు తీసి తాగబోతుంటే...ఆ నీటిలో చెట్టుకు వేలాడుతూ గుత్తిగా మూడు నారింజపళ్ళు కనిపించాయి. వాటిని చూడగానే ఆకలి అనిపించింది. ముందు దాహం తీర్చుకున్నాడతను. తర్వాత ఆకలి తీర్చుకోవడానికి, గట్టు మీది చెట్టుకి గుత్తిలా వేలాడుతున్న మూడు నారింజపళ్ళలోంచి ఓ పండును తెంచాడు. ఒలిచాడు దాన్ని. తొనలు చీల్చేంతలో అందులో ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది.

‘‘తియ్యగా లడ్డూ ఉంటే పెట్టు.’’ అడిగింది.‘‘లడ్డూనా? నాకెక్కడిది?’’ అన్నాడు అంగుడు.‘‘అయితే నన్ను యథాతథంగా పండులో పెట్టి, మూసేయ్‌.’’ అంది యువతి. మూసేశాడు అంగుడు. మూసేసిన మరుక్షణం ఒలిచిన తొక్కను కూడా చుట్టుకుని, చూస్తూండగానే పండు వెళ్ళి యథాస్థానంలో వేలాడసాగింది. రెండో పండును తెంచాడు అంగుడు. దాన్ని ఒలిచాడు. తొనలు వేరు చేసేంతలో అందులో కూడా ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది.‘‘తియ్యగా లడ్డూ ఉంటే పెట్టు.’’ అడిగింది.‘‘నాకెక్కడిది? లేదు. ఉంటే పెట్టేవాణ్ణి.’’ అన్నాడు అంగుడు.‘‘లడ్డూ లేనప్పుడు నన్నెందుకు బయటికి తీశావు. నా పండులో నేనుంటాను, మూసేయ్‌.’’ అంది యువతి. మూసేశాడు అంగుడు. తొక్కసహా పండు వెళ్ళి యథాస్థానంలో వేలాడసాగింది. మూడోది తెంపబోయాడు. తెంపబోతూ ఆగి పోయాడు. ముందు రెండు పళ్ళలో ఉన్నట్టుగానే మూడోదానిలో కూడా అందమైన యువతి ఉండి ఉంటుంది. ఉంటే ఆమె కూడ లడ్డూ అడుగుతుంది. లేదంటే...మళ్ళీ మామూలే! అలా జరగడానికి వీల్లేదు. లడ్డూ సంపాదించి, యువతిని సొంతం చేసుకోవాలనుకున్నాడు అంగుడు. అనుకున్నాడే కాని, ఆ నిర్జన ప్రాంతంలో లడ్డూ ఎక్కడ దొరుకుతుంది? పరిగెత్తి పట్నానికి వెళ్ళి తీసుకుని రావాలనుకున్నాడు. గుర్రాన్ని అధిరోహించబోయాడు. అంతలో మిఠాయి వాసన సోకిందతనికి. ఆనం దంగా చూశాడటు.