ఉదయం తొమ్మిదిగంటలైనా అక్టోబర్‌ చలి ఇంకా తొలగనేలేదు.డొంకదారిలో మంచుతెరలను అటూ ఇటూ తోసుకుంటూ పల్లె మనుషులు పనులకుపోతున్నారు. మమ్మల్ని పరికిస్తూ కొందరు, పలకరిస్తూ మరికొందరు. మా అక్కచెల్లెళ్ళు శుభ్రంగా కడిగి పసుపు పూసి, బంతి చేమంతులూ, మల్లెగులాబీలతో అలంకరించడంతో పూలతేరులాగ ఉంది నాన్న విరామాలయం. ఇంకా చెప్పాలంటే గంగజాతరకు కట్టిన చాందినీ బండిలా ఉంది పల్లెకాడబాయి పక్కనే మడిలో మానాన్న నిదురిస్తున్న అంతిమ విరామాలయం. నీళ్ళు లేని బావి, సాగులేని మడి పట్నవాసపు చిక్కుల బతుకులా కంపచెట్లకు లొంగిపోయి ఉన్నాయి.

పద్నాలుగు సంవత్సరాలైంది నాన్న మాకు దూరమై. ఆయన జ్ఞాపకాలు మా అందరిలో సాంద్రమైతా ఉన్నాయి. నాన్న పల్లెవదలి రాయచోటికి చేరి వారాలు చేసుకుంటూ చదువుకున్నాడు. ఆ ఊతంతో ఉద్యోగంలో చేరి మాకూ పట్నం పుట్టుకలూ బ్రతుకులనూ ఇచ్చినా, పల్లెమూలాల్ని మాత్రం వదల్లేదాయన. ఎంతదూరంలో ఉద్యోగం చేస్తున్నా వేసవి సెలవులకు మమ్మల్ని పల్లెకు తీసుకువచ్చేవాడు. ఎక్కడెక్కడో ఉన్న మేంఅందరమూ, నాన్న మాకు దూరమైన ఈ రోజున పల్లెకు చేరుకుంటాం. నాన్నను తలుచుకుంటూ బాల్యాన్ని తడుముకుంటూ గడుపుతాం. నాన్న పూలమేడచుట్టూ మేం ఐదుగురు అన్నదమ్ములం ప్రదక్షిణ చేసి టెంకాయలు కొట్టి మొక్కుకున్నాం.

దీగూట్లో ఉన్న జ్యోతికి మొక్కుకుని సమాధి చప్పట దిగగానే పంపకాలలో పేచీ పెట్టిన పెదమ్మకొడుకు కుమారయ్య మా దగ్గరగా వచ్చాడు, ‘‘ఇంటికి పోదాం రాండిరా బువ్వదిని పోదురుగాని’’ అన్నాడు. ‘‘ఒద్దులేన్నా లేటైతాది. పేషంట్లు కాసుకోనుంటారు’’ అన్నాడు కడపలో ఉండే కంటి డాక్టరు పంకజనాభ. మాలోవాడు నడిపోడు. ‘‘అవున్లేరా మీకు యాడకుదర్తాది నిజిమేలే పేషంట్లు ఎరగమోస్కోనుంటారు మీకోసం. సర్లే పాండి ఇంకోతూరి మాత్రం నిలబడాల్సిందే’’ అన్నాడు క్షణం ఆలస్యం చేయకుండా. ఇట్లా ఇంత తేలిగ్గా వదిలివేయబట్టే కదా బంధాలు, తెగిన గాలిపటాల్లాగా మారి అందరం పట్నాల్లోకి కొట్టుకుపోతున్నామేమో! నాకైతే చుట్టింట్లో కూర్చొని సంగటి ఊరిబిండి తినాలని మనసు పీకుతా ఉంది. చుట్టిల్లు కూల్చి కట్టిన మిద్దింటికెళ్తే వరన్నమూ పప్పుసాంబారూ పెడతారని భయం వేసి నిశ్శబ్ధంగా ఉండిపోయా.