విరాటుడనే రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా భావించి వారి సుఖసంతోషాలకోసం అహర్నిశలూ ఎంతో శ్రమించేవాడు. అందువల్ల దేశంలో అవినీతి, అక్రమాలు పూర్తిగా నశించాయి. రాజు చేసిన ప్రజోపయోగకర శాసనాలవల్ల ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు.

విరాటుడికి సుబుద్ధి, కుబుద్ధి అనే ఇద్దరు మంత్రులున్నారు. ఇద్దరికిద్దరూ ఎంతో తెలివైనవాళ్లే కానీ, బుద్ధులు మాత్రం వాళ్ల పేర్లకు తగ్గట్లే ఉండేవి. వారిలో సుబుద్ధి మంచివాడు. రాజు తనకిచ్చే జీతం, కలిగించిన సదుపాయాలతో తృప్తిపడి సుఖంగా జీవిస్తున్నాడు. కుబుద్ధి స్వార్ధపరుడు. అంతో ఇంతో అవినీతికి పాల్పడి ఉన్న సంపదని పెంచుకోవాలని అతడి కోరిక. కానీ రాజు అహర్నిశలూ అన్ని వ్యవహారాలూ తను కూడా చూసుకోవడంవల్ల, అవినీతికి అవకాశం లేకుండా పోయి ఇబ్బంది పడుతున్నాడు.రాజు పద్ధతి మార్చాలని నిత్యం ఆలోచించేవాడు కుబుద్ధి. ఒకరోజున అతడు విరాటుడితో, ‘‘రాజా! ఇప్పుడు మనరాజ్యం సుభిక్షంగా ఉంది. ఒక్కసారిగా పదిమంది శత్రురాజులు చుట్టుముట్టినా ఎదురెళ్లి తిప్పికొట్టగల సైనికబలం మనకు ఉంది.

వరుసగా పదేళ్లు కరువు వచ్చినా తట్టుకోగల ధాన్యసంపద ఉంది. ఏళ్లతరబడి వరదలొచ్చినా ప్రజలకు ఇబ్బంది కలుగనివ్వని సదుపాయలున్నాయి. తమరింత శ్రమపడటం ఇంకా అవసరమా? కనీసం కొన్నాళ్లైనా విశ్రాంతి తీసుకోండి’’ అన్నాడు.విరాటుడు నవ్వి, ‘‘మంత్రివర్యా! నీ అభిమానానికి సంతోషం. అయితే - నిన్నటి విందుభోజనం నేటి ఆకలి తీర్చదు. సమస్యలు లేకుండా జీవించాలంటే మనిషి అహర్నిశలూ శ్రమించాలి. రాజుని కాబట్టి మనదేశ ప్రజలందరి బాధ్యతా నామీద మరింత ఎక్కువ ఉంటుంది. అందుకే నేను అందరికంటే ఎక్కువ శ్రమించాలి. నేను విశ్రాంతి గురించి ఆలోచించానో, ఆ రోజునుంచే దేశానికి పతనం మొదలౌతుంది. నా ఒంట్లో శక్తి ఉన్నంతకాలం నేను శ్రమిస్తూనే ఉంటాను. శ్రమలోనే నాకు విశ్రాంతి’’ అన్నాడు.