హైదరాబాద్‌లో ఉంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని.. ఇంట్లో పనికి ఇబ్బందవుతోందని ఓ పనిమనిషిని పెట్టుకుంది.. అడిగినంత జీతం ఇచ్చింది. ఇంట్లో మనిషిలాగానే చూసుకుంది. సెలవులు పెట్టినా.. జీతంలో మాత్రం కోత విధించలేదు.. కానీ అనుకోకుండా ఇంట్లో పనికి రావడం మానేసింది.. పక్కింట్లో పనికి వస్తున్నా.. తన ఇంట్లోకి ఆమె రాకపోవడం ఏంటని ఆ యజమానురాలికి ఆలోచన మొదలైంది.. తీరా అసలు విషయం తెలిసి.. 

*******************

‘‘గీ పని పాడువడ. పన్నాశినం గాను. గీ పనికగ్గివెట్ట. నేంబుట్టినంకనే గీ పనిబుట్టిందేమో.. గింత పుర్సత్‌ లేని బత్కాయె’’ మొగని మీది కోపం బాసాండ్ల మీద తీసుకుంటా ఉపేంద్ర.ఆ సప్పడుకు టీవీల డిబేట్లు గమనించే ఉపేంద్ర యింటాయిన రాజాలు ‘‘ఏంది లొల్లి పొద్దుగాల్నే .. ఏందీ రసరస .. సుకూన్‌గుండలేవా.’’

 

‘‘నీ తీరు యింట్ల పనిపాట జేయకుంట వుంటే నేంగూడ సుకూన్‌గుంట’’ రెట్టించింది ఉపేంద్ర.‘‘యింట్ల పని నేంజెయ్యనన్ననా, నాకేమొ కిచెండ్ల పని రాదాయె.’’‘‘పని రాదని సెప్పెడు బాగలువాటైంది. నీ వోల్నే తల్లికడుపుల్నించి బుట్టిన. నేను పుడ్తానే గిన్నెలు గంటెలు బట్టుకొని పుట్టిన్నా’’ గిన్నెనెత్తేస్తూ..రాజాలు, ఉపేంద్ర కోపం తగ్గియ్యాలని ‘‘ఎందుకురా యింత హైరానా పడ్తవ్‌ .. పనామెను బెట్టుకుందాంలే’’ గిన్నెలు సర్దుతా..‘‘పెట్టుకుందామనుడే గాని ఎవర్నన్నా సోల్తి దీసి తీస్కచ్చినవా..’’‘‘యాడరా.. నేను యింట్లుంటె సాయం జేత్తనే వుంట గదా..’’ రాజాలు బుజ్జిగించినట్లు మాట్లాడుతూంటే ..యింతలో ఫోను రింగవుతుంటే ..‘‘అగో.. పో.. ఫోనచ్చింది. మద్యానందాక యింతే సంగతులు. సాయంజేత్త, సాయంజేత్తంటడు.

యింట్లున్నంత సేపు సెల్లు మాట్లాడుడు, పేపరు జూసుడు, టీవీ జూసుడే సరిపాయె. యింకేంజేత్తడు యింట్లపని’’ గునుసుకుంట బియ్యం గడిగి పొయినేసింది.ఉపేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. కుటుంబంలో యిటేడు తరాలు.. అటేడు తరాలు ఎవ్వరూ చదువుకోలే. ఉపేంద్రనే సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్లో చదువుకొని, ఉద్యోగ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగంల చేరింది. వూళ్లల్ల టీచరుద్యోగమొస్తే చెయ్యలే. కులం పట్టింపులు, వేదింపులు బాగుంటయని. కనిపిచ్చినోల్లను ఏం కులమ్మీదని అడుగుతుంటరు.

యిట్లాంటి అవమానాలు బడిన ఉపేంద్ర హైద్రాబాద్‌ల గియన్ని వుండయి, మంచిగుంటది, ఎవర్నిఎవరు పట్టించుకోరు, కులపట్టింపులే లేవని విన్నది.అందుకోసం హైద్రాబాద్‌ల వుద్యోగమొచ్చేటట్టు కష్టపడి జాబ్‌ కొట్టేసింది. ఆఫీసుల షరీకైనంక యిల్లు వెతుక్కునేటప్పడు తెల్సింది, యీడ గూడ కులం బందబస్తుగనే వున్నదని. కాలనీలంటే వూర్లు అనీ, బస్తీలంటే వాడలని అర్తమైంది. యీ తేడా తెల్వక ఒక కాలనీల యిల్లు కోసం దిరిగినపుడు ‘మీరేమిటోల్ల’ని మొకమ్మీదనే అడుగకుండా ‘వెజ్‌టేరియండ్లకే’ అనే కుల ఆంక్షలకు దడుసుకొని బస్తీ యిండ్లు యెతుక్కొనొచ్చి వుంటున్నరు.