బెంగగా ఉంది లక్ష్మికి. చాలా బెంగగా ఉంది.తను ఒక్కతే. ఇంకెవరూ తోడులేరు. తనకి తన కొడుకు తప్పఎవరూ తోడులేరు. వాడేమో మాట వినడం లేదు. తను ఇప్పటికే వయసంతా అయిపోయి చివరి కాలంలోకి చేరుకుంది.మరి తను కొడుకుని నిలబెట్టొద్దూ!అలా అని అంటే వాడు ‘‘నేను నిలబడే ఉన్నాను కదా. నీకేం భయం? నువ్వు సరిగ్గా ఉండు. నా గురించి ఆలోచించకు. ఈ వయసులో నేను నీ గురించి ఆలోచించాలి గాని, నువ్వు నా గురించి ఆలోచించడమేమిటి? అలా రెండు పూటలా వాకింగ్‌కి వెళ్ళిరా. ఊసుపోతుంది. హెల్తు బాగుపడుతుంది’’.‘‘రోజూ రెండు పూటలా వాకింగ్‌కి వెళ్తూనే ఉన్నాను. కూరలకీ, పాలూ, పెరుగూ వెచ్చాలు తేవడానికి, ఇక ఎంతకని వెళతానురా?’’‘‘నిన్ను వాకింగ్‌కి వెళ్ళమన్నాను కాని, ఇవీ అవీ తెమ్మనలేదు. 

ఉండు ఒక మనిషిని ఎవరినేనా చూడమని సెక్యూరిటీ వాళ్ళకి చెప్తాను. అతను ఆ పన్లు చేస్తాడు. నువ్వు చేతులూపుకుంటూ ఫ్రీగా తిరుగు. నీకు చులాగ్గా అనిపిస్తుంది’’.‘‘ఎందుకురా, నేనలా అన్నానా? వస్తువులవీ తెస్తూ మార్కెటింగ్‌ చేసుకుంటూ పోతుంటేనే కులాసాగా నడవగలను. ఇదేం ఆర్మీలో మార్చ్‌ఫాస్ట్‌లాగా ఏమిటి?’’‘‘మరిక నీకు తోచదని అంటావా? మన కారు డ్రైవర్ని రెండు పూటలా రమ్మంటాను. సిటీ సెంటర్‌కి వెళ్ళి పిక్చర్స్‌ చూడు. హాయిగా ఉండు. కుకింగ్‌ అవీ పెట్టుకోకు. లోకేష్‌ వాళ్ళు కుక్‌ని పెట్టుకున్నారట. వాళ్ళ అమ్మానాన్నా చాలాహేపీగా ఉన్నారు. మనింట్లో కూడా అలాటి కుక్‌ని పెడదాం. వర్రీ లేకుండా కూచుని పేపర్లు, పుస్తకాలు చదువుకో’’.‘‘అంతా బావుంటుందిలే. కానీ అయితే లోకేష్‌కి వాళ్ళ అమ్మానాన్నా ఇద్దరున్నారు.

ఒకరికొకరు తోడు. అలా కబుర్లు చెప్పుకున్నా గడిచిపోతుంది. నాకే... నేనొక్కత్తినే. కాలం గడవదు. ఎవరినేనా తోడు తెమ్మంటే తేవు’’.‘‘నీకు తోడు అంటే నన్ను పెళ్ళి చేసుకోమని కదా నవ్వు చెప్పేది. ఇదుగో చూడు. నువ్వు ఆ మాట మాత్రం ఎత్తకు. నాకు పెళ్ళంటే పెద్దబోరు. పెళ్ళిచేసుకోవడం, ఇరవై నాలుగ్గంటలూ ఒకరికి ఒకరు పడక తగాదాలు, అవేకాక పిల్లలు పుట్టినాక వాళ్ళ బాధ్యత, వాళ్ళని పెంచడం, వాళ్ళ చదువులూ... ఇంక లైఫేం ఉండదు. నీతో ఎన్నోసార్లు చెప్పేను నా పెళ్ళిమాట ఎత్త వద్దని. నీ పని నువ్వు చూసుకో. నా ఇంటిమేట్‌ విషయాల్లో తలదూర్చకు’’.