మా సిన్నాయన బిడ్డె మల్లక్క. నా కంటే రొండు తరగతుల సిన్న. మా యింట్ల నేను సిన్న బిడ్డనైతే, మా చిన్నాయినింట్ల మా మల్లక్క సిన్న బిడ్డ. మా మాదిగ్గూడెంల మేమిద్దరమే సదువుకున్న ఆడపిల్లలము. మమ్ముల శాన గావురంగా జూసేది, మా కుటుంబెములనే గాదు మొత్తం మా గూడెమ్‌లనే ‘‘అబ్బో నర్సన్న సిన్న బిడ్డె, పోశన్న చిన్న బిడ్డె ఆష్టలుకు బోయి సదువుకుంటుండ్రు, మన లెక్క కూలినాలికి బోకుండా తప్పిచ్చుకున్నరు.

 రాసుకొని పుట్టిండ్రు’’ అని సెప్పుకొనేటోల్లు.నన్ను సోషల్‌ వెల్ఫేరాస్టల్ల యేస్తే, మా మల్లక్కను పేరు మార్సి మరియ అని పెట్టి క్రిస్టియన్‌ ఆస్టల్ల యేసిండ్రు. మేమిద్దరమూ యెండాకాలమ్‌ సెలువుల్లనే కలిసేటోల్లము. నాకు వేరే పిల్లల కంటే... మల్లక్కతోని ఆడుకునుడే చానా ఇష్టంగుండె.‘అయ్యయ్యో దమ్మక్క ఆటలు’, ‘ముక్క ముక్కు పుల్ల గీన్నే పోయింది యేదేడ బోయిందో, యొంకులాడుకో ఆటలు’, ‘దాగుడుమూతలాటలు’ - గిట్ల బాగాడుకుందుము. మా సోషల్‌ వెల్ఫేర్‌ ఆస్టలుకు దసుర, సంకురాత్రి, యెండాకాలమ్‌ సెలవులుంటే ... మల్లక్క క్రిస్టియన్‌ ఆస్టల్‌కు యాడాదికి ఒక్కసారే అదీ, యెండాకాలమ్‌లనే.నాకు సెలవులిచ్చి ఇంటికి బొయినంక, మా సిన్నాయిన యింటికి బొయి ‘మల్లక్క నెప్పుడు తీస్కత్తరే... జెప్పన తీస్కరాండ్రి’ అంటే ... ‘‘యిప్పుడు మల్లక్క అనద్దు బిడ్డా, మల్లక్క మరియ అయ్యింది. మరియ అనే పిలువాలె బిడ్డా’’ అని చెప్తే నేం గూడ ‘మరియా’ అని పిలుసుడు కొత్తల కొంచెం అలువాటు గాకున్న తర్వాత అలువాటయ్యింది.‘మరియను జెప్పన తీస్కరాండ్రి’ అని పోరు పెట్టేది. మరియ కోసం పెసల్లు, సెనిగలు, బుడ్డ సెనిగలు దాసిపెట్టి ఉంచుకుందును.

మరియ వచ్చినంక యేంచుకొని బుక్కొచ్చు అని కొండకెదురు సూసినట్లు సూసేది. మరియ వచ్చిందంటే... నాకు పండు పండుగుండేది. వాల్ల ఆస్టలు వార్డెన్‌, మా ఆస్టల్‌ వార్డెన్‌ గురించి, బువ్వలు, కూరలు, పచ్చి పులుసు గురించి, సినిమాల గురించి ఏమేమో కతలు ఎంతకూ ఒడవక పోవు. యెండాకాలమ్‌ యెన్నెల పుచ్చ పువ్వోలె కాస్తాంటే... వుడుకుడుకు బువ్వల సింతపండు తొక్కేసుకొని ఓనాడు వుల్లిగడ్డల పులుసు, వోనాడు గొడ్డు తునుకలు, వట్టిసాపలు, యిట్లా యేకూరయినా, తొక్కయినా, కూరల్లేకున్నా గంజిబువ్వల వుప్పేసుకుని తిన్నా ఐసరమజ్జా గుండేది. ఒక్కొక్కనాడు బువ్వ తిన్నా, తినకున్నా లేని లేని ముచ్చట్లు సెప్పుకుంట, నవ్వుకుంట అట్లనే నిద్రబోదుము. వో రోజు మాయింట్ల, వోరోజు మరియోల్లింట్ల. అట్లా మరియ నేను అత్కాపత్కాముందుము.