రామనగరమనే ఊళ్లో చిత్రగుప్తుడనే భాగ్యవంతుడికి లేకలేక పుట్టిన కుమార్తె చిత్ర. అల్లారుముద్దుగా పెరిగిన చిత్రకి పద్దెనిమిదోఏట ఏదో వింతజబ్బుచేసి క్రమంగా కృశించిపోసాగింది. చిత్రగుప్తుడు నగరంలోని ఘనవైద్యులందర్నీ పిలిపించాడు. చిత్రకు ఎవరి వైద్యమూ పనిచేయలేదు.

అన్ని ఆశలూ నిరాశ చేసుకున్న సమయంలో ఒక బైరాగి వాళ్లింటికి వచ్చాడు. ఆయన చిత్రనుచూసి, ‘‘ఈమెనొక దుష్టగ్రహం బాధిస్తోంది. ఈమె జబ్బును మందులు తగ్గించలేవు. సమీపారణ్యంలో చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి దేవిని దర్శించుకుంటే ఈమెకు పట్టిన దుష్టగ్రహం పీడ వదిలిపోతుంది. అయితే ఆలయానికి ఈమె ఒంటరిగా నడిచి వెళ్లాలి’’ అన్నాడు.‘‘అయ్యా! ఆ అరణ్యంలో క్రూరమృగాలు సంచరిస్తున్నాయి. అది దొంగలకు నిలయం. జబ్బుతో కృశించిన ఆడపిల్ల ఒంటరిగా నడిచి ఆలయానికి ఎలా వెళ్లగలదు?’’ అనడిగాడు చిత్రగుప్తుడు కంగారుగా.బైరాగి మందహాసం చేసి, ‘‘అమాయకుడా! ఈ ప్రపంచంలో చావు పుట్టుకలు మన చేతిలో లేవు. నీ భవంతిలో క్షేమంగా ఉన్నావని నీవు అనుకోవచ్చు. రేపు ఏ భూకంపమోవస్తే ఈ భవనంలోనే నువ్వు భూస్థాపితమైపోతావు.

అనవసరపుటాలోచనలు మానుకుని నీ కూతుర్ని నేను చెప్పినవిధంగా దేవీ దర్శనానికి పంపు. మేలు జరుగుతుంది. లేదా ఆమె నీ కుటుంబానికి దక్కదు’’ అన్నాడు. చిత్రగుప్తుడు సరేనని అందుకు తగిన ముహూర్తం నిర్ణయించమన్నాడు. బైరాగి మర్నాటికే ముహూర్తంపెట్టాడు.ఆ ప్రకారం మరుసటిరోజున చిత్ర ఒంటరిగా ఇంటినుంచి బయల్దేరింది. నడుచుకుంటూవెళ్లి అడవిలో ప్రవేశించింది. అప్పుడామెకి పరిసరాలస్పృహ లేదు. అన్నింటికీ దేవినే నమ్ముకుని ముందుకి నడుస్తూ బైరాగి చెప్పిన చాముండేశ్వరి ఆలయం చేరుకుంది. అది దేవి మహిమో ఏమోగానీ ఆమెకు శరీరశ్రమ తెలియలేదు. దారిలో ఎక్కడా విషసర్పాలు, క్రూరమృగాలు, బందిపోట్లు ఆమెను బాధించలేదు.