ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్ర్తీ ఉంటుందంటారు. చాలా సందర్భాల్లో ఆ స్ర్తీ గురించి ప్రపంచానికి తెలియదు. తెలిసే అవకాశం కూడా ఉండదు ఈ పురుష ప్రపంచంలో. ప్రతి మగవాడి చెడ్డ ఆలోచనలోనూ కొన్నైనా మార్పులుతెచ్చి, అతడివల్ల జరిగే నష్ట తీవ్రత నివారించడం వెనుక కూడా ఒక స్ర్తీ ఉంటుంది. ఈ కథలో జరిగిందదే. ప్రేమ, లాలిత్యం, అతిసున్నితమైన సేవాతత్పరత...వెరసి ఓ రెండు కన్నీటిబొట్లే నష్ట నివారణకు ప్రేరణగా నిలిచాయి. అదెలాగంటే.....

*******************

ఆ ఇల్లు మంచి అభిరుచులు ఉన్న ధనవంతుల ఇల్లు అని చూడగానే తెలుస్తుంది.అక్కడ యూనిఫాంలో ఉన్న సెక్యూరిటీని చూసినా, లోపల చక్కగా మెయిన్‌టెయిన్‌ చేస్తున్న పచ్చటి లాన్‌ చూసినా, వరసగా ఉన్న పూలచెట్లు, జామ, మామిడి, కొబ్బరిచెట్లను చూసినా, అక్కడ తోటపని చేసుకుంటున్న ఆ మాలీని చూసినా, ఎత్తైన పోర్టికోలో ఉన్న బి.ఎమ్‌.డబ్ల్యు కారుని చూసినా, అందమైన నగిషీలతో ఉన్న పెద్ద తలుపు చూసినా...ఇది బాగా ధనవంతుల ఇల్లు మాత్రమే కాదు, మంచి అభిరుచి ఉన్నవాళ్ళు ఉండే ఇల్లు అని తెలిసిపోతుంది.ఆ ఇంటి గేట్‌ పక్కన మధురవాణి అని బంగారు అక్షరాలలో చక్కగా చెక్కిన పేరు ఉంది. మరో పక్క గుణకర్‌ అనే పేరు కూడా అలాగే బంగారు అక్షరాలతో చెక్కి ఉంది.

గుణకర్‌ యువకుడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయాడు. పెదనాన్నే అతడికి గార్డియన్‌. ఆయన సంరక్షణలో ఉన్నా కూడా గుణకర్‌ చాలా స్వతంత్రంగా గడపడానికి బాగా అలవాటుపడ్డాడు. అందువలన పెదనాన్న పెద్దరికం లీగల్‌ డాక్యుమెంట్స్‌కే పరిమితమైపోయింది. తెంపరితనం, జులాయితనం కలబోసుకుని, ఎవరినీ లెక్కచేయని మనిషిగా తయారయ్యాడు. అందుకే సమాజం కట్టుబాట్లను లెక్క చేయకుండా సరోజిని కూతురు మధురవాణిని పెళ్ళిచేసుకున్నాడు. అదృష్టం బాగుండి అతను చేపట్టిన వ్యాపారాలన్నీ కలిసి వచ్చాయి. కొద్దికాలంలోనే ఆ ఊళ్ళో ఉన్న ధనవంతులలో ఒకడిగా పేరుపొందాడు. రాజకీయాలలోకి కూడా ప్రవేశించాడు.తెలుగునాట కొన్నేళ్ళుగా మంచికో చెడ్డకో కొన్నిపేర్లు ప్రాచుర్యం పొందాయి.

విడి విడిగా చూస్తే ఆ పేర్లు మంచివే కావచ్చు కానీ అవే పేర్లు మహాకవులు ప్రాణప్రతిష్ఠచేసిన కొన్ని కాల్పనికపాత్రలు కావడంవల్లనో, కొందరు అద్భుత కళాకారులు జీవంపోసిన పాత్రలు కావడంవల్లనో, ఆ పేర్ల పట్ల సమాజ స్పందన కాస్త వేరుగానే ఉంటుంది. అలాగే మధురవాణి పేరు కూడా. ఆమెకు ఆ పేరుపెట్టిన మహానుభావుడు ఎవరో ఆమె తల్లి సరోజినికి మాత్రమే తెలుసు. కానీ మధురవాణిమాత్రం తనపేరువల్ల చాలా వివక్షకు గురైంది. ఆమె సౌందర్యరాశి! అయినా అది ఆమెకు ఆనందాన్ని ఇవ్వకపోగా, ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. గుణకర్‌తో వివాహం జరిగాక, ఎంతో చక్కటి శీలవర్తనం కలిగి ఉన్నా ఆమెకు లభించాల్సిన గౌరవం సమాజంలో దొరకలేదు. ఆ వీధిలో ఎవరూ ఆమెను తమ ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానించేవాళ్ళు కాదు!!