ఒకానొకప్పుడు కోసల దేశంలో అరాచకం పెచ్చుమీరింది. ఎక్కడ చూసినా తగవులు, కొట్లాటలే.రాజ్యంలో ప్రశాంత వాతావరణం ఏర్పడ్డానికి మహారాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఫలించలేదు.ఆ రాజ్యానికి సమీపారణ్యంలో ఉండే మహేశ్వర యోగి మహామహిమాన్వితుడని పేరు పడ్డాడు. 

కోసలరాజు అడవికి వెళ్లి ఆయన్ని కలుసుకుని, ‘‘మహాత్మా! నా రాజ్యంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అఖండ తపోసంపన్నులైన తమరే నన్ను ఈ విపత్తునుంచి కాపాడాలి’’ అన్నాడు.మహేశ్వరయోగి సరేనని రాజుకు ధైర్యం చెప్పి వెనక్కు పంపేశాడు.తర్వాత ఆయన తన శిష్యుల్లో పదిమందిని పిలిచి, ‘‘మీకు నా తపోశక్తిలో కొంత ధారపోస్తాను. ఫలితంగా మీకు దివ్యశక్తులు వస్తాయి. మీరు కోసలదేశంలో నలుమూలలకీ వెళ్లండి. మీ శక్తుల్ని ప్రజాక్షేమానికి ఉపయోగించి అక్కడి పరిస్థితుల్ని చక్కబర్చండి’’ అని చెప్పాడు.మహేశ్వరయోగి శిష్యులు గురువుకి మ్రొక్కి కోసల దేశంలో తలోచోటకీ వెళ్లారు. సామాన్యుల ఇబ్బందులు తీర్చడానికి గురువుపేరిట పది మహేశ్వరపీఠాల్ని నెలకొల్పారు. ఆరంభంలో జనం ఆ పీఠాల్ని పెద్దగా పట్టించుకోకపోయినా నిరుత్సాహపడకుండా, మహేశ్వరపీఠాల్ని జనం గుర్తిస్తారన్న నమ్మకంతో ఉన్నారు ఆయన శిష్యులు.

వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఒకరోజు గౌరి అనే బిచ్చగత్తె ఓ మహేశ్వరపీఠం సాయం కోరి వచ్చింది.గౌరి భర్త శంకరం చిన్నవ్యాపారి. ఆయనకు కొద్దిగా పొలం కూడా ఉంది. ఒకరోజు శంకరం పొలంలో పాము కాటేసి చనిపోయాడు. అప్పటికి గౌరికి ఇద్దరు కొడుకులు. వాళ్లింకా చిన్నవాళ్లు. పిల్లలు ప్రయోజకులయ్యేదాకా భర్త వదిలి వెళ్లిన వ్యాపారం, వ్యవసాయం కొనసాగించడానికి, ఆమె వికారుడనే దూరపుబంధువు సహాయం కోరింది. వాడు దుష్టుడు. వాడు ఆమెను నమ్మించి ఆస్తి తన పేరిట రాయించుకున్నాడు. ఆమె కొడుకుల్ని తన ఇంట్లో కట్టుబానిసలుగా ఉంచుకుని ఆమెని ఇంట్లోంచి గెంటేశాడు. బ్రతకడానికి వేరే దారిలేక బిచ్చమెత్తుకుని బ్రతుకుతున్న గౌరికి మహేశ్వరపీఠం గురించి తెలిసింది. ఏ పుట్టలో ఏ పాముంటుందోనన్న ఆశతో ఆమె అక్కడికి వెళ్లింది.