అడవిమార్గంలో పట్నం బయలుదేరిన ఇద్దరు స్నేహితులు ఒక చెట్టుకింద సేదదీరారు. నిద్ర సమయంలో మిత్రుడి దగ్గరున్న 200 వరహాలను కాజేశాడు మరోమిత్రుడు. దాంతో వారిమధ్య గొడవ మొదలైంది. ఆ దారినపోయే ఒక బైరాగి మహిమగల మూలికతో వారిద్దరినీ పరీక్షించాడు. కానీ దొంగతనం చేసినవాణ్ణి ఆ మూలిక దొంగ అని నిర్థారించలేకపోతోంది. ఎందుకని? అసలది నిజంగా మహిమగల మూలికేనా? లేక అది నిజమే చెబుతోందా? లేక ఏదైనా మతలబుందా?

విక్రమార్కుడు తన పట్టుదల వదలలేదు. తిరిగి చెట్టువద్దకు చేరుకున్నాడు. చెట్టెక్కి బేతాళుడు ఆవహించిన శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవాన్ని ఆవహించిన బేతాళుడు, ‘‘రాజా, ఈ అపరాత్రివేళ సుఖనిద్ర మానుకుని ఇక్కడికొచ్చావంటే, భిక్షువు దగ్గర మహిమలున్నాయనీ, అవి నీకు ఉపయోగపడతాయనీ భావిస్తున్నావని నా అనుమానం. అయితే మనిషికి మహిమలకంటే తెలివే ఎక్కువ ఉపయోగపడుతుందని వివేకవంతుడైన నీకు తెలియదనుకోను. కానీ ఒక్కోసారి ఆ విషయం స్ఫురించేసరికి జరగాల్సిననష్టం జరిగిపోవచ్చని వెంకటప్పయ్య అనేవాడు కాస్త ఆలస్యంగా గ్రహించాడు. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.

ఒకానొక గ్రామంలో సోమనాథుడు, వెంకటప్పయ్య అనే స్నేహితులుండేవారు. ఒకసారి సోమనాథుడు పదివేల వరహాలు తీనుకుని పట్నం వెడుతూ సాయంగా తోడురమ్మని వెంకటప్పయ్యను అడిగితే సరేనని తనూ కొంత డబ్బు తీసుకుని బయల్దేరాడు.పట్నానికి కొంతమేర అడవిమార్గంలో వెళ్లాలి. ఇద్దరూ అడవిలో కొంతదూరం ప్రయాణం చేశాక అలసిపోయి ఓ చెట్టుక్రింద కూర్చున్నారు. అప్పుడు వెంకటప్పయ్య సోమనాథుడితో, ‘‘మిత్రమా! చాలాకాలం తర్వాత పట్నం వెడుతున్నాను.

అక్కడ వింతైనవీ, విలువైనవీ వస్తువులు కొనాలని ఉంది. కూడా వెయ్యివరహాలు తెచ్చుకుంటున్నాను కానీ ఇప్పుడు ఆలోచిస్తోంటే ఆ డబ్బు చాలదనిపిస్తోంది. నీ దగ్గర పదివేల వరహాలున్నాయి కదా! వాటిలో వెయ్యి వరహాలు నాకు అప్పుగా ఇవ్వగలవా?’’ అన్నాడు.దానికి సోమనాథుడు వెంటనే, ‘‘మన్నించు మిత్రమా! ఈ పదివేల వరహాలూ కూడా నేను పట్నంలో మా బంధువుకు బాకీ తీర్చడానికని తీసుకువెడుతున్నాను’’ అన్నాడు.