బెస్ట్‌ మేనేజర్‌ అవార్డ్‌ అంటూ ఉంటే దానికి నాంచారయ్యే సంపూర్ణమైన అర్హుడు. అలాని అతడేదో కంపెనీలో మేనేజర్‌ అనుకునేరు! అతడొక కంట్రాక్టర్‌! అలాని రోడ్లు, భవనాలు నిర్మించే కంట్రాక్టరూ కాదు!తెల్లరేషన్‌ కార్డు కావాలా? నాంచారయ్యని కలవండి. స్థలం అమ్మాలా? లేకపోతే కొనాలా? నాంచారయ్యని కలవండి.భూమి కబ్జాచేయలా? దానికీ అతడినే కలవండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇట్టే మేనేజ్‌ చేసి పని సానుకూలం చేసే కంట్రాక్టర్ నాంచారయ్య. ఐతే అందుకు ఖర్చు కాస్త ఎక్కువే అవుతుంది మరి!

అందరి సమస్యలూ చిటికెలో పరిష్కరించే అలాంటి నాంచారయ్యకి సొంత ఇంట్లోనే ఒక సమస్య వచ్చి పడింది.తన ఏకైక కుమారుడు గారాల బుజ్జిబాబు హోంవర్క్‌ చేయడంలేదట. స్కూల్లో టీచర్‌ తిడుతున్నదట. స్కూలుకి పోనని వాడి హఠం చేస్తున్నాడు. ఈ సమస్య పరిష్కరించమని నాంచారి భార్య నస పెడుతున్నది.‘‘ఆ టీచర్‌ని లేపేద్దాం’’ తేలికగా అనేశాడు నాంచారయ్య.‘‘ఆ మాత్రానికే చంపేస్తారా?!’’ దిగ్భ్రాంతిగా అడిగింది భార్య.‘‘చంపడం కాదే పిచ్చిమొగమా! ఆ టీచర్‌ బదులు మరో టీచర్‌ ఆ క్లాసుకి వెళ్లేట్లు మేనేజ్‌ చేద్దాం’’ విలాసంగా నవ్వాడు నాంచారయ్య.

‘‘ఆ కొత్త టీచర్‌ మాత్రం తిట్టదా? అసలు సమస్య టీచర్‌ కాదు. మనవాడు హోంవర్క్‌ చెయ్యకపోవడం!’’హోంవర్క్‌ చెయ్యడానికి ఒక అమ్మాయిని కుదిర్చాడు నాంచారయ్య. బుజ్జిబాబు చేయాల్సిన హోంవర్క్‌ తనే చేయడం, బుజ్జి కొట్టినా, తిట్టినా, రక్కినా, జుట్టుపీకినా భరించడం ఆ అమ్మాయి డ్యూటీ! బుజ్జిబాబు హోంవర్క్‌ మేనేజ్‌ చేయడం కష్టం కాలేదు నాంచారయ్యకి. కాని వాడు పదోక్లాసుకి వచ్చాక పబ్లిక్‌ పరీక్ష రూపంలో గండం దాపురించింది.