గోదావరీనదీతీరాన మహేంద్రపురి అనే సుసంపన్నమైన నగరం ఉండేది.ఆ నగరంలో ఓ బెస్తవాడు మీనాకరుడు. ఒకరోజు వాడివలలో పంచరంగులచేప ఒకటిపడింది. మీనాకరుడు ఆ చేపను తన భార్యకిచ్చి కూర వండమన్నాడు.మీనాకరుడిభార్య చేపను రెండుముక్కలుగా కోసింది. అందులోంచి ధగధగ మెరిసే ఉంగరమొకటి బయటపడింది. ఆమె వెంటనే ఆ ఉంగరాన్ని కడిగి తీసుకెళ్లి భర్తకు చూపించింది. మీనాకరుడు ఆ ఉంగరాన్ని పరీక్షించిచూసి, ‘‘ఇది సామాన్యమైన ఉంగరంకాదు. దీని విలువ కొన్ని లక్షలవరహాలు చేయవచ్చు’’ అన్నాడు.

ఆ ఉంగరం ధరించాలని మీనాకరుడి భార్య ముచ్చటపడింది. మీనాకరుడు ఆమెను వారించి, ‘‘ఇంత విలువైన ఉంగరాన్ని ధరించడం మనకు ఏవిధంగానూ లాభించదు. పైపెచ్చు ఇది ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ఈ ఉంగరాన్ని అమ్మి ఆ వచ్చినడబ్బుతో మనం సుఖంగా జీవించవచ్చు’’ అన్నాడు.భర్త చెప్పింది సబబుగానే తోచడంవల్ల మీనాకరుడిభార్య వెంటనే దీనికి అంగీకరించింది. మీనాకరుడు ఆ ఉంగరాన్ని తీసుకుని ఆ నగరంలోని ప్రముఖ నగలవ్యాపారస్థుడివద్దకు తీసుకుని వెళ్లి జరిగిన విశేషం చెప్పాడు. వర్తకుడు వెంటనే ఆ ఉంగరాన్ని పరిశీలించి, ‘‘ఇది విలువైనదనడంలో సందేహంలేదు.

ఇంత విలువైన ఉంగరాన్ని ధరించే తాహతు నాక్కూడాలేదు. నీ దగ్గర్నుంచికొంటే నేనిది ఇంకెవరికైనా అమ్మాలి. ఐతే నీకిది నదిలోని చేపకడుపులో దొరికిందంటున్నావు. దీని అసలు యజమాని దీనికోసం వెతుకుతూ ఉండవచ్చు. కాబట్టి దీన్ని నేను నీ దగ్గరకొన్ని అంగట్లో అమ్మకానికిపెడితే నాకు నష్టం జరుగుతుంది. నేను దీన్ని నా భార్యకు ఆభరణంగా ఇద్దామనుకుంటున్నాను. అందుకు నేను నీకు ఇవ్వగల మొత్తం పదివేల వరహాలు మాత్రమే’’ అని చెప్పాడు.