విక్రమార్కుడు తన పట్టుదల వదలలేదు. చెట్టువద్దకు తిరిగి చేరుకున్నాడు. చెట్టెక్కి బేతాళుడు ఆవహించిన శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవాన్ని ఆవహించిన బేతాళుడు, ‘‘రాజా, ఈ అపరాత్రివేళ నువ్వీ కష్టం పడడానికి నీ మంచితనమే కారణం కావచ్చు. కానీ ఒకోసారి మేలు తలపెట్టినా కూడా ద్రోహం అనిపించుకునే ప్రమాదముంది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే - స్నేహభావంతో మంచి సలహాలిచ్చి మిత్రద్రోహి అనిపించుకున్న వీరయ్య గుర్తుకొస్తున్నాడు. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.

ఒకప్పుడు సీతావురం అనే ఊరికి భూషయ్య గ్రామాధికారిగా ఉండేవాడు. ఆయన స్వార్థపరుడు, ధూర్తుడు. తన అవసరాలకోసం ఆయన గ్రామస్థుల్ని పలువిధాల వేధించేవాడు. ఊళ్లో ఏదైనా నేరం జరిగితే న్యాయాన్యాయాలు పాటించకుండా తన ఇష్టప్రకారం తోచిన తీర్చునిచ్చేవాడు. అందువల్ల గ్రామస్థులు తనమీద రాజుకి ఫిర్యాదు చెయ్యొచ్చని భూషయ్యకి తెలుసు. అందుకే అతడు రాచకొలువులో పనిచేసే ప్రముఖులు కొందరితో స్నేహం చేశాడు. తరచుగా రాజధానికి వెళ్లి వాళ్లను కలునుకుని విలువైన కానుకలిన్తూండేవాడు. వారందరికీ భూషయ్యంటే ఇష్టం ఏర్పడింది.భూషయ్య గురించి రాజుకు ఫిర్యాదులు వెడితే, ఆయన తన కొలువులోనివాళ్లని సంప్రదించేవాడు.

‘‘ప్రభూ! భూషయ్య కారణంగా సీతాపురం పౌరులు సుఖపడుతున్నారు. అందుకే గ్రామస్థుల్లో ఎక్కువమంది ఆయన్ని ఇష్టపడతారు. పళ్ళు కాసిన చెట్టుకే రాళ్లదెబ్బలెక్కువ అంటారు కదా! మీరు విన్నవన్నీ ఆయనంటే గిట్టని కొద్దిమంది చేసే దుష్ప్రచారం’’ అని ఆయన్ని నమ్మించారు వాళ్లు.భూషయ్య ప్రవర్తన ఎలాగున్నా, ఆయనవల్ల గ్రామస్థుల్లోనూ కొందరు ప్రయోజనం పొందుతున్నారు. ఆ స్వార్థంతో వాళ్లు ఊళ్లో మరీ ఎక్కువ అలజడి వుట్టకుండా చూసుకునేవారు. గ్రామం ప్రశాంతంగానే ఉండడంవల్ల రాచకొలువులో వాళ్ళు చెప్పిన మాటల్ని రాజు నమ్మేవాడు.