‘‘తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెళ్లిందట. ఏ పనీ లేనపుడు మనిల్లే గుర్తుకొస్తుంది కావును. ఇదిగో మిమ్మల్నే. మీ చిత్తుగాడు గారొచ్చారు!’’ అంది వెంకటలకి్క్ష బెడ్రూమ్‌లో బట్టలిస్త్రీ చేసుకుంటున్న భర్త భద్రాద్రి దగ్గరకొచ్చి.‘‘చచ్చేం, ఆదివారమని ఈవేళ చాలా పనులు పెట్టుకున్నానే!’’ అన్నాడతడు గుండెల మీద చెయ్యివేసుకుంటూ.చిదానందం అలియాస్‌ చిత్తుగాడు గారికి ఆదివారాలు, సెలవులే కాదు, ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా మిత్రుడింటికొచ్చి వాల్తాడు. ‘‘స్నేహం అంటే అదీ!’’ అని ముచ్చటపడుతూ వుంటారు చూసినవాళ్లు. కాని, ‘అసలు బాధ భరించేవాళ్లది’ అంటుంది వెంకటలకి్క్ష. అది ఆమె మాటల్లోనే వినాలి.‘‘తనది కాకపోతే తాడిచెట్టుకెదురు డేకమన్నాట్ట! చూసే వాళ్లకేం తెలుస్తుంది చేసే వాళ్ల బాధ? పొద్దున్నే వచ్చేసి, ఇక్కడే కూచుండిపోతే ఇక మా పన్లేం కావాలి? ఈ మహానుభావుడే క్షణాన్నయినా దాపురించొచ్చని కాఫీ టిపిన్లే కాదు బియ్యం కూడా ఓ రెండు గ్లాసులెక్కువే పోస్తా. ‘అలా విసుక్కోకే, మనతోబాటే వాడూనూ’ అంటూ మా ఆయన గారు నాకు సర్దిచెప్పడానికే చూస్తారు గానీ, రావద్దని తన ప్రియాతి ప్రియమైన మిత్రుడికి చెప్పలేరు కదా! అయితే, ఓవిధంగా మా ఆయన కంటే నేనే కాస్త సుఖపడుతున్నానేమో ననిపిస్తుంది. ఏదో వండుకున్నది కాస్త ఈ చిత్తుగాడు గారి మొహాన కొట్టి నా పన్లు నేను చేసుకుంటాను వంటింట్లో. ఈయనకలా కాదు కదా. పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ ఆయనని, ఆయన చేసే చేష్టలని భరిస్తూ వుండాలి. కాఫీ తాగుతూ ‘స్రుళ్‌ స్రుళ్‌’ చపళ్లు చేసినా, టిఫిన్లు తింటూ ‘ప్‌చూ ప్‌చూ’ శబ్దాలు చేసినా, నోటితో ‘తుంపర సేద్యం’ చేస్తూ మా ఆయన్ని తడిపేసినా భరించాల్సిందే. సోఫా మీదా, కిందా కర్వేపాకులు, మిరపకాయ ముక్కలూ పోస్తూవుంటే, వొళ్లు మండిపోతున్నా చూస్తూ వూరుకోవాల్సిందే. (తర్వాత శుభ్రం చేసుకోవడం నాకు తప్పదులెండి.) తిరిగే కాలూ తిట్టే నోరూ ఖాళీగా ఉండవంటారు కదా! తినేసి ఊరుకోకుండా ఆఫీసులోవాళ్లనో, కాలనీ వాళ్లనో లేక వాళ్ల బావమరుదులనో, మావగారినో తిట్టిపోస్తూ, ‘వింటున్నావా’ అంటూ మధ్యలో ఈయన్నో దెబ్బకొట్టి మరీ వినిపిస్తూ వుంటాడు. 

చచ్చినట్టు ‘ఊ’కొడుతూ వినాల్సిందే కదా.పొద్దున్నొచ్చిన వర్షం గాని, చుట్టం గాని ఆరోజుకి వదలరట! పొద్దున్నే సిద్ధమైన ఈ పెద్దమనిషి ఆరోజు మధ్యాహ్నం భోజనం చేసి, విశ్రమించి ఏ సాయంత్రమో, రాత్రో గాని మమ్మల్ని వదలడు. పోనీ, ఉన్నంతసేపూ ఊరికే ఉంటాడా? ఊహు, కాలు మీద కాలేసుక్కూచుని, నన్ను పిలిచి, ‘ఏంటి చెల్లెమ్మా, ఇల్లు సర్దుకోలేదా? ఆ గూళ్లూ అవీ ఎవరన్నా వచ్చి చూస్తే బావుండదు! అదేవిటీ, గ్యాస్‌ సిలిండర్‌ ఈశాన్యంలో పెట్టారూ? అక్కడ బరువుండకూడదు, అరిష్టం!’ అంటూ మంటెక్కేలా మధ్యమధ్యలో ఉచిత సలహాలు! నా పరిస్థితే చూడండి, మా ఆయనతోబాటు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా. ఇంటి పని ఏం చేసుకున్నా ఆదివారాలే చేసుకోవాలి. వాకిట్లో అతిథిని కూచోబెట్టి, ఆయన మీదనే బూజులు దులుపుకోలేం కదా!