మూలికా మహాత్మ్యం- - -8

అతడో గొప్ప రత్నాలవ్యాపారి. గంధర్వకన్యను తలదన్నే అందగత్తె అతడి కుమార్తె. శాపవశాన గంధర్వకన్య అతడి కడుపున పుట్టిందని ఊళ్ళో అందరూ అనేవారు. చిన్నప్పటినుంచీ ఆ మాటలు వినీవినీ గంధర్వకన్యగానే తనను భావించుకుంది ఆమె. గంధర్వుణ్ణితప్ప మరొకర్ని పెళ్ళిచేసుకోనని మొండికేసింది. ఆమె కోరకున్నవిధంగా ఒకరోజు హఠాత్తుగా గంధర్వుడే ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు! ఆ తర్వాత ఏం జరిగిందంటే....

ఒకానొక గ్రామంలో రమణయ్య అనే పేదవాడు ఉండేవాడు. తల్లిదండ్రులు ఇచ్చిపోయిన ఓ చిన్న పెంకుటిల్లు ఒక్కటే అతడికున్న ఆస్తి. ఆ ఇంటా ఈ ఇంటా పనిచేస్తూ, ఇరుగుపొరుగువారి దయాధర్మంమీద బ్రతుకుతున్నాడు రమణయ్య. చాలా గొప్పగా బ్రతకాలనే కోరిక ఉంది అతనికి. కానీ ఆ కోరిక తీరే మార్గం కనిపించదు.ఒకరోజు రమణయ్య తన ఇంట్లో నిద్రపోతుండగా, అర్ధరాత్రి అలికిడైంది. దాంతో మెలకువవచ్చింది. లేచిచూస్తే, ఎదురుగా తన ఈడు యువకుడొకడు కనిపించాడు. ఇలా అర్థరాత్రిపూట తనింట్లో చొరబడి నిద్రపాడుచేసిన ఆ యువకుణ్ణిచూసి, ‘‘ఎవరు నువ్వు?’’ అని అడిగాడు రమణయ్య కోపంగా.ఆ యువకుడిపేరు మల్లన్న. బ్రతకడానికి ఏ దారీతోచక దొంగతనాలు చెయ్యడం మొదలెట్టాడు. అలా ఒక ఊళ్లో రాత్రిపూట దొంగతనం చేస్తుండగా, ఇంటియజమాని లేచి కేకలుపెట్టాడు. ఎలాగో అక్కణ్ణించి తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు మల్లన్న.

అడవిలో అతడికి ఒక సాధువు కనిపించాడు. అతడి కథవిని జాలిపడ్డాడు. ‘‘ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఏదో ఒకరకంగా దొంగలే, కాబట్టి దొంగతనం తప్పుకాదు’’ అని అతడికి ఒక మూలిక ఇచ్చాడు. ఆ మూలికని గట్టిగా వాసనపీల్చితే కోరుకున్న రూపం వస్తుంది. అయితే ఆ రూపం ఒక గంటసేపు మాత్రమే ఉంటుంది. ఆ గంటలోనూ చకచకా దొంగతనం ముగించుకో. మారినరూపంలో ఉన్నప్పుడు పట్టుబడినా, పేదవాళ్లని దోచుకోవాలనుకున్నా, నీ అవసరానికి మించి దొంగతనం చేసినా -ఈ మూలిక మహాత్మ్యం పోతుంది’’ అని మల్లన్నకు చెప్పాడు సాధువు.మల్లన్న ఈకథ రమణయ్యకుచెప్పి, ‘‘ఈరోజు ఊరంతా తిరిగాను. చూడ్డానికి ప్రతివాడూ ధనవంతుడిలానే కనిపిస్తున్నాడు. ప్రతివాడూ లేనివాడిలాగానూ కనిపిస్తున్నాడు. ఎవరు ఉన్నవాళ్ళో ఎవరు లేనివాళ్ళో తెలుసుకోవడమెలాగోతెలియక సతమతమౌతుంటే నువ్వు కనబడ్డావు. నువ్వు ఈ ఊళ్లో చాలామందిఇళ్లల్లో పనిచేయడం చూశాను. నీకు అందరిగురించీ బాగాతెలిసి ఉండాలి.

నువ్వు నాకు సహాయపడితే, నా సంపాదనలో సగంవాటా నీకు ఇస్తాను, ఆడితప్పను’’ అన్నాడు మల్లన్న. అందుకు అంగీకరించాడు రమణయ్య. ఊళ్లోవాళ్ళగురించి తనకి తెలిసిన వివరాలు చెప్పాడు. మల్లన్నవిని ఊరుకోలేదు. అతణ్ణి చాలాప్రశ్నలు వేశాడు. అన్నింటికీ రమణయ్య ఓపికగా సమాధానాలు చెప్పాడు. వివరాలన్నీ ఆకళింపు చేసుకున్నాక మల్లన్న మొదటిరోజు ఓ ఇంటిముందు కాపుకాశాడు. ఆ ఇంటి యజమాని ఏదో పనిమీద ఇంట్లోంచి బయటకి వెళ్ళడం చూశాడు. వెంటనే తను ఆ యజమానిరూపం ధరించి లోపలికి వెళ్ళాడు. దొరికినంత డబ్బూ, నగలూ తీసుకుని బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అవసరాన్నిబట్టి ఒకోఇంట్లో ఒకోరకం వేషంవేసి రోజుకొక దొంగతనం చేశాడు. అలా మల్లన్న ఆ ఊళ్లో పదిరోజులున్నాడు. ఇక తన ఊరికి తిరుగుప్రయాణమవుతూ, దొంగతనాలుచేసి సంపాదించిన సొమ్మును రెండువాటాలు చేశాడు. అందులో ఒకటి రమణయ్యకిచ్చి, ‘‘ఇంతవరకూ నేను సంపాదించి కూడబెట్టిన ఈ సొమ్ముతో నాకు ఐదు ఎకరాలపొలం వస్తుంది. నా గ్రామానికిపోయి వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకుతాను’’ అన్నాడు మల్లన్న.