బ్యాంకులో డబ్బు డ్రా చేసుకొని టైం చూసుకున్నాడు సాయి. ‘ఫర్వాలేదు ఇంకా అరగంట పైగా వుంది క్లాసుకి’ అనుకుంటూ స్టాఫ్‌ రూం వైపుకి బయల్దేరాడు. ‘‘సాయీ నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇలారానీకో విషయం చెప్పాలి’’ అంటూ బాబూరావు పక్కకి తీసికెళ్లాడు సాయిని.‘‘ఇందాకా మీ ఆవిడొచ్చి వెయ్యిరూపాయలడిగింది’’ అన్నాడు. వాళ్ల మదర్‌ హటాత్తుగా సిక్‌ అయిందని ఫోనొచ్చిందట. నువ్వుంటే నిన్నడిగేదేమో. పాపం కష్టంలో వుంది ఇద్దామా అనుకున్నాను గానీ, ఇస్తే నువ్వేం అంటావేమోనని లేదని అబద్ధంఆడేశాను’’ అన్నాడు బాబూరావు ఏదో గొప్ప ఘనకార్యం చేసినవాడిలా.‘‘మంచి పనిచేశావు. అది డబ్బు ఎక్కడైనా పుట్టించగలదు. అయినా వాళ్ల నాన్న బోలెడు సంపాదించి పెట్టేడు. వెయ్యి రూపాయలు లేవా దాని పర్సులో. నాటకాలు కాకపోతే’’ అన్నాడు సాయి కళ్లలో కసి నింపుకొని. ‘‘ఈ దెబ్బతో వాళ్లమ్మ హరీ మందంటే పీడా పోతుంది. తల్లిని చూసుకునే దానికంత అహం! వస్తా టెంత్‌క్లాసు వాళ్లకి కొత్త లెసన్‌. ఓ సారి చూసుకోవాలి’’ అంటూ స్టాఫ్‌ రూంలోకి నడిచేడు సాయి.సాయి, అతడి భార్య కిరణ్మయి ఆ స్కూల్లో టీచర్లు. ఆమె ఇంగ్లీషు, సాయి ఫిజిక్సు. ట్రైనింగులో అయిన పరిచయం క్రమంగా పెరిగి వారి పెళ్లికి దారితీసింది. తర్వాత ఇద్దరికీ ఒకే చోట పోస్టింగ్సు ఇచ్చారు. పెళ్లయి ముచ్చటగా మూడేళ్లు కూడా కాకుండానే ఇద్దరి మధ్యా పొరపొచ్చాలొచ్చాయి. సాయి విడాకులకి దరఖాస్తు చేశాడు. 

విడిపోవడానికి తాను ఒపకోనంది కిరణ్‌. ఆర్నెల్ల బట్టీ సాగుతోంది విడాకుల కేసు. అప్పట్నించీ అదే ఊళ్లో తన పుట్టింట్లో వుంటోంది కిరణ్‌. రోజూ స్కూల్లో కలుస్తున్నా ఇద్దరూ మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎదురుపడితే తనే ముందుగా ‘గుడ్‌ మాణింగ్‌’ అంటుంది కిరణ్‌. దానికి బదులిచ్చే కనీసం సంస్కారం లేదు సాయికి.భార్య మీద చాడీలు చెప్పి చెప్పి టీచర్సులో ఒక వర్గాన్ని, తన వైపుకి తిపకున్నాడు. వాళ్లలో ఒకడు బాబురావు. కేవలం మిత్రుడిని సంతోష పెట్టడం కోసం అవతలి వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో వున్నప్పటికీ తను చెయ్యగలిగిన సహాయం కూడా చెయ్యలేదతగాడు. అందుకే సాయికి బెస్టు ఫ్రెండు అయ్యాడు.ఏ క్షణమైనా అత్తగారు పోయినట్లు ఫోనొస్తుందని ఆశగా ఎదురుచూశాడు సాయి. ఫోనేం రాలేదు. సాయంత్రం వరకూ చూసి చూసి ఇంటికి చేరేడు. ఇల్లు తాళం వేసి వుంది. పక్కింటి వాళ్ల తలుపు తడితే ఆ ఇంటావిడ తలుపు తీసి, ‘‘ఎలా వుంది మీ అమ్మగారికి’’ అంది.‘‘మా అమ్మకా? మా అమ్మకేమైంది? మా ఇల్లు తాళం వేసుందేమిటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు సాయి.