అట్లూరిపరాత్పరరావు తండ్రి అయ్యాడు. కొడుకు. మూడోనెలకి తల్లి తండ్రులు వద్దన్నా బయలుదేరింది అతని భార్య అత్తారింటికి. ఎల్లుండి వచ్చేస్తుంది తన కొడుకుతో. సైకిల్ని చాలా వేగంగా తొక్కుతున్నాడు. రాబోయే కొడుక్కి బేబిపౌడర్ కొనడానికి. వన్ టవున్‌లో స్మగుల్డ్ గూడ్స్ అమ్ముతారు. తన కొడుక్కి కావల్సిన యార్డ్‌లి బేబి పౌడర్, బేబి సోప్ అక్కడే దొరుకుతాయి. విదేశాలలో తయారు చెయ్యబడింది కాబట్టి తన కొడుకు మృదువైన చర్మానికి ఆ బేబీ పౌడరే అనువైనదని అతని పరిశోధనలో తెలింది.

అసలు తన భార్య గర్భందాల్చిందని గైనకాలజిస్టు చెప్పిందగ్గిరనుండి అతను గర్భిణి కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు, శిశువుల ఆరోగ్యానికి తగిన సూచనలు సేకరించడం మొదలు పెట్టాడు. విదేశి పత్రికలైతే సరైనా సమాచారం ఇస్తాయని, వాటిని అద్దెకిచ్చే లైబ్రేరికి చందా కట్టాడు. బాంక్ నుండి వచ్చిన తరువాత ప్రతి రోజు రాత్రి పది పదకొండు గంటల వరకు అవన్నీ వివరంగా చదివి తనకి ముఖ్యమైనవి అనుకున్న వాటంటిన్ని ఒక నోట్‌బుక్‌లోకి ఎక్కించేవాడు.పరాత్పరరావు తండ్రి హృద్రోగంతో అతని చిన్ననాటే పొయ్యాడు. తల్లి కష్టపడి అతనిని, అతని చెల్లెల్ని చదివించింది. అతను కూడ ఆమెని ఇబ్బంది పెట్టకుండా బి.కామ్ వరకు చదువుకుని ఒక జాతీయ బాంక్ లో ఉద్యోగం సంపాదించుకున్నాడు.

తనకున్నంతలో చెల్లెలి పెళ్ళి చేసి పంపేసాడు. పరాత్పరరావు పెళ్ళి చేసిన కొన్ని నెలలకే తల్లి తన బాధ్యతలు తీరినవనుకుంటూ ఒక తెల్లవారు ఝామున “కృష్ణా, రామా” అనుకుంటూ వెళ్ళి పోయింది. భార్య సుగుణవతి. భర్తని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అందుకే ఒంటరిగా ఏమి ఇబ్బందులు పడతాడో అనుకుంటూ తల్లితండ్రులు పుట్టింట్లో మరికొంతకాలం ఉండమంటున్నా ఆగకుండా వచ్చేస్తోంది.ఎఫ్ఫుడూ బస్సుల్లో తిరిగే పరత్పారరావు ఆరోజున రైల్‌వే స్టేషన్ దగ్గిరనుంచి ఇంటికి వెళ్ళడానికి ఆటో మాట్లాడాడు. బస్సులో ఒకవేళ సీట్ దొరకకపోతే కొడుకు, ప్రయాణికుల మధ్య, వారి ఒత్తిడికి నలిగిపోతాడేమోనని. అంతే కాదు జలుబు, కామెర్లు లాంటి వ్యాధులున్న ప్రయాణికులుంటే తన కొడుక్కి అంటుకుంటాయేమోనని భయం కూడా ఉంది పరత్పారరావుకి.