అప్పుడే తెలతెలవారుతోంది. తలుపు తీసుకుని బయటకు వచ్చాడతను. ఎదురుగా కనిపించిన దృశ్యంచూసి ఆశ్చర్యపోయాడు. ఒక ఇంట్లో సామాను లారీలోకి ఎక్కిస్తున్నారు. ఏమిటి, ఇంత ఆకస్మికంగా...? అర్థం కాలేదతనికి. కానీ పట్టించుకోనట్టుగా తల పక్కకు తిప్పుకున్నాడతను. అంతలోనే అతడిని గమనించింది ఆమె. సామాన్లు సర్దటం ఆపి అతడివద్దకు వచ్చింది. ఓ చిన్న కాగితంముక్క అతడి చేతికి ఇచ్చింది. అందులో ఏముంది? ఇంతకీ ఆమె ఎవరు?

కిరాణాషాపులో కూర్చుని వార్తాపత్రిక తిరగేస్తున్నాడు రాఘవులు. ఆ షాపే అతనికి జీవనాధారం. పెద్దగా ఆదాయం వస్తుందని కాదుగాని అతనికి మరో విద్య తెలియదు. మనిషి పెద్దగా ఏమీ చదువుకోలేదు. ఆ వార్తాపత్రికని కూడా ఒక్కో అక్షరం కూడబలుక్కుని చదవటమే!షాపులో ఉన్న గడియారం సమయాన్ని తొమ్మిదికి దగ్గరగా సూచిస్తోంది. రాఘవులు దానివంకచూసి, ‘‘అమ్మా, టైమవుతోంది’’ అని కేకేశాడు, ఇంటి లోపలికి వినిపించేలా. ఆ వెనకే ఆనుకుని ఉంది ఇల్లు కూడా. షాపులోంచి లోపలికి ద్వారం ఉంది.‘‘అయిదు నిమిషాలు నాన్నా!’’ ముద్దులొలికే ఓ పదేళ్లస్వరం వినిపించింది లోపలినుంచి. మరో మూడు నిమిషాలలోనే స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని ఇవతలకి వచ్చింది ఆ పాప.

పేరు గాయత్రి. పాలుగారే ఆ నును బుగ్గల్ని ముద్దాడి ‘‘చెల్లి తయారుకాలేదామ్మా ఇంకా!’’ అని మురిపెంగా చూశాడు రాఘవులు.‘‘నాన్నా!’’ అని పలికింది ఎనిమిదేళ్ల శ్రీవిద్య. తయారై అప్పటికే గుమ్మం వరకు వచ్చింది ఆ పాప. రెండుజడల ఆ చిట్టి ఆకారాన్ని చూడగానే ‘‘అడ్డెడ్డెడ్డే! తయారయ్యావా నాన్నా! రారారా!’’ అంటూ చేయి చాచాడు రాఘవులు. వెంటనే వచ్చి తండ్రిని ఆలింగనం చేసుకుంది ఆ చిన్నారి. అతను ఆ చిట్టితల్లి బుగ్గలమీద ఆగకుండా మూడు ముద్దులు పెట్టుకున్నాడు. ఆ పాపది అచ్చు తల్లి పోలికే!‘‘సరే! జాగ్రత్తగా వెళ్లిరండి తల్లీ!’’ రాఘవులు వారి చేతిలో చాక్లెట్స్ పెట్టాడు. స్కూల్ అక్కడికి దగ్గరే.

కాలినడకన రెండునిమిషాల్లో చేరుకోవచ్చు. పిల్లలు స్కూలుకు వెళ్లాక మళ్లీ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు రాఘవులు.‘‘ఓ పాలప్యాకెట్ ఇవ్వండి!’’ డబ్బులతో చేయి చాచింది ఓ వ్యక్తి. రాఘవులు పేపర్ పక్కనపెట్టి, ట్రేలో నుంచి పాలప్యాకెట్ తీసి ఆమె చేతికి ఇచ్చాడు. వచ్చిన పని అయినా ఆమె కదల్లేదు. అతనికి తెలుసు! అందుకే తల ఎత్తలేదు! మళ్లీ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. అతని మౌనం ఆమెని అక్కడినుంచి నిష్క్రమింపచేసింది. ఆ వయ్యారి పేరు రుక్మిణి. నడకే వయ్యారం, కానీ మనిషి చాలా పద్ధతి కలది. రెండేళ్ల క్రితం వాళ్లమ్మతో కలిసి ఎదురింట్లో అద్దెకి దిగిందామె. ఎలా మనసైందో తెలీదుగాని ఆమెకి రాఘవులు అంటే పిచ్చి!