ఆఫీసువాళ్ళంతా కట్టకట్టుకుని నామీద కక్షగట్టారు. లేనిపోనిసాకులు చూపించి, ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ, ఉద్యోగంలో చేరిన సంవత్సరానికే నన్ను ఇంటికి పంపించారు. ‘‘బతకడం చేతగానివాడితో కలిసి జీవించలేను’’ అని కట్టుకున్నభార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ నా బతుకుపోరాటం ప్రారంభమైంది. ఉద్యోగాల వేట మొదలుపెట్టాను. చివరకు....

 

******************

అది కోర్టు.కోర్టు బోనులో ఉన్నది అతి సాధారణ మనిషే.కానీ కోర్టంతా జనంతో నిండి ఉంది.ఆరోజు జరగబోతున్న నేర విచారణకు అంతమంది జనం వస్తారని ఎవరూ ఊహించ లేదు. అదేమీ రాజకీయనాయకుడి దొంగనోట్ల కేసో, సినిమా హీరో చేసిన రేప్‌ కేసో, స్వామీజీ చేసిన హత్య కేసో కాదు. ఓ అనామకుడు, నిర్భాగ్యుడికి సంబంధించిన కేసు. అసలు ఆ కేసేమిటంటే...

******************

అది నాలుగురోడ్ల కూడలి. రాత్రి పగలు అనే తేడాలేకుండా జనం ఆ ప్రాంతంలో సంచరిస్తూనే ఉంటారు. అటువంటిచోట పట్టపగలు నగరంనడబొడ్డున బస్‌షెల్టల్‌లో ఓ అభాగ్యురాలిని ఓ దుర్మార్గుడు నిస్సిగ్గుగా, పశువులా మారి మానభంగం చేస్తుంటే ఎవ్వరికీ ఏమీ పట్టనట్టు, సినిమా చూసినట్టు చూస్తూ, తమతోవన తాముపోతున్నారు.ఆ దృశ్యాన్ని ఓ నిరుద్యోగి బేవార్సీగాడు తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. క్షణాలమీద అది తన మిత్రులకు, అక్కడినుంచి మ చుట్టూవున్నవారికి అలా అలా అదో ప్రముఖవార్తలా నగరమంతా వ్యాపించింది. మరుసటిరోజు అన్ని ప్రముఖదినపత్రికలూ మొదటిపేజీల్లో ఆ వార్తను ప్రచురించారు.

అన్ని టీవీ చానళ్లలోనూ అదే వార్త. మహిళాసంఘాల చర్చాగోష్టి, మేధావుల మనోవేదనారోదనాలు, అసమర్థపాలనలో స్త్రీలకు రక్షణలేదన్న విపక్షాల గావుకేకలు, నిరసనలు...ప్రభుత్వం విచారం వ్యక్తంచేస్తూ ఆ ఘటనమీద ఒక నిజనిర్ధారణ కమిటీని వేసింది. బాధితురాలికి పదిలక్షల రూపాయలు నష్ట పరిహారం ప్రకటించి, నేరస్తుడికి కఠిన శిక్ష వేయాలని సూచించింది.నిజ నిర్ధారణ కమిటీలో తేలిన అంశాలు ఏమిటంటే, నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి జాడ తెలియలేదు. ‘సముద్రపుఒడ్డుకు కొట్టుకొచ్చినశవం ఆమెదేనా?’ అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు చెబుతూ, నిస్తేజమైన జనసమూహంమీద విరుచుకుపడింది ఆ కమిటీ.