అమెరికా నుంచి కొడుకు కుటుంబం వచ్చేసిందన్న కబురుతో అక్కడ రోదనలు మిన్నంటాయి. ‘‘ఇంకా ఉంచడం పద్ధతికాదు. అన్నీ రెడీ చేశాం, ఇక మొదలెట్టేదాం. వాళ్ల అబ్బాయిని పంచె కట్టుకుని రమ్మనండి’’ ఎదురింటాయన చెప్పిన మాటలు విని గౌతమ్‌ దగ్గరకొచ్చాడు చిన్నాన్న. భుజాన చెయ్యివేసి అనునయంగా మాట్లాడుతూ జరగాల్సినదాని గురించి చెప్పాడు. ఎలా చెప్పాలో అర్థంకాక సతమతమౌతూనే అడ్డంగా తలూపాడు గౌతమ్‌ ‘‘నోనో, ఇవేం కాదు. ఈ కార్యక్రమాలేం లేవు.. వాళ్లని పంపించేయండి’’. గౌతమ్‌ మాటలు విన్నవాళ్ళు విస్తుపోయారు. అసలేం జరిగిందంటే...

 

************************

నార్త్‌ లాస్‌వేగాస్‌లోని స్పేస్‌టెక్‌ అంతరిక్ష ప్రయోగశాలలో ఆ క్షణాలు ఉద్విగ్నంగా గడుస్తున్నాయి.‘‘టీ–మైనస్‌ నైన్‌ మినిట్స్‌ హోల్డ్‌ టైమ్‌ ఇనీషియేటెడ్‌’’అతి ముఖ్యమైన ఘట్టానికి చేరుకునే క్రమంలో గౌతమ్‌ నోటివెంట స్పష్టమైన ఆదేశం వెలువడింది.టీ–క్లాక్‌లో కౌంట్‌డౌన్‌ సరిగ్గా మైనస్‌ తొమ్మిది నిముషాల దగ్గరకు చేరింది. ఆ విరామ సమయంలో నలభై ఐదు నిమిషాలకు రాకెట్‌ సన్నద్ధతకు సంబంధించిన పరీక్షలతోపాటు, అభిప్రాయాలసేకరణ జరుగుతోంది.లాంచ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఉన్న వందలాది సైంటిస్టులు నిర్దేశిత లక్ష్యాలను పర్యవేక్షిస్తూ గో–నోగో అభిప్రాయ సేకరణకి స్పందిస్తున్నారు. లాంచ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ ఆధ్వర్యంలో అనుకున్న రీతిన లాంచింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. ఒక్కో లక్ష్యం విజయవంతంగా పూర్తవుతోంది.

మరికొద్దినిమిషాల్లో అంతరిక్షనౌక గెలాక్టిస్‌ టూ–బీ ఆకాశంలోనికి దూసుకుపోబోయే అద్భుత క్షణాలను వీక్షిస్తున్నారందరూ.‘‘త్రీ... టూ... వన్‌... జీరో... టీ–మైనస్‌ నైన్‌ మినిట్స్‌ కౌంటింగ్‌ ఇనీసియేటెడ్‌’’ కౌంట్‌ డౌన్‌ గడియారం తిరగం మళ్ళీ మొదలైంది. ఆ క్షణంలో ఆటోమేటిగ్గా పనిచేసే గ్రౌండ్‌ లాంచ్‌ సీక్వెన్సర్‌ పనిచేయడం మొదలైంది.తమ కలలసాఫల్యంగా లాంచ్‌ప్యాడ్‌మీద ఠీవిగా నిలిచిన గెలాక్టిస్‌ టూ–బీ అంతరిక్షనౌక కొద్దినిమిషాల్లో నిప్పులు చిమ్ముతూ నింగిలోనికి రివ్వున ఎగసే ఘట్టం కోసం సైంటిస్టులూ, ఇంజనీర్లూ కనురెప్పలు వేయకుండా ఎదురుచూస్తున్నారు.

‘‘టీ–మైనస్‌ సెవెన్‌ మినిట్స్‌ థర్టీ సెకెండ్స్‌’’.ఆర్బిటర్‌ యాక్సెస్‌ ఆర్మ్‌ అనువైనస్థితికి మారింది. అందుకు బాధ్యులైన గ్రౌండ్‌ సిబ్బంది అంతా తమ ప్రణాళిక ప్రకారం విధులు నిర్వర్తించారు.‘‘టీ–మైనస్‌ ఫైవ్‌ మినిట్స్‌’’ హైడ్రాలిక్‌ సిస్టమ్స్‌కి అవసరమైన పవర్‌ యూనిట్లన్నీ అందుకున్నాయి.‘‘టీ–మైనస్‌ థర్టీ వన్‌ సెకెండ్స్‌...’’ గౌతమ్స్‌ నుంచి ‘‘ఆటో సీక్వెన్స్‌ స్టార్ట్‌’’ అనే ఆదేశం రాగానే గ్రౌండ్‌ సీక్వెన్సర్‌ నుంచి కంట్రోల్స్‌ అన్నీ షటిల్‌ ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్లకి బదలాయించబడ్డాయి.