అతనంటే ఆమెకు పిచ్చి. చిన్నప్పటినుంచీ అంతే. అతడినే భర్తగా భావించింది. వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆ విషయం తెలుసు. ఉదయమే వెళ్ళి అతడిని మేల్కొలిపేది. మళ్ళీ సాయంత్రం కూడా అతడింటికెళ్ళేది. రెండు పూటలా అతన్ని చూడకపోతే ఉండలేకపోయేది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందతన్ని. పదిహేనేళ్ళు అలా గడచిపోయాయి. ఇంతకూ వాళ్ళు పెళ్ళి చేసుకున్నారా? లేదా?

ఎదుటివారికి బాగా కష్టం కలిగిన వార్త విన్నా, మనసుని ఇది వరకటిలా పట్టుకోవటం లేదు. మన సుఖం, మన ఇష్టం, మన కష్టం... ఇలా అంతా ఒన్‌వేలా ఉంటోంది పరిస్థితి. అటువంటి మనస్థితిలోనే ఆ వార్త విన్నాడు జగదీశ్‌. వినగానే వెంటనే కొంత బాధ కలిగింది.చిన్ననాటి స్నేహితురాలు లక్ష్మి. కేవలం స్నేహితురాలే కాదు, అంతకన్నా ఎక్కువ. ఎలా ఎక్కువంటే అంతతేలిగ్గా చెప్పలేని క్లిష్టతతో కూడిన ఎక్కువ. జగదీశ్‌తో ప్రసన్నలక్ష్మి మెలిగిన తీరేవేరు. తను లక్ష్మి అనే పిలిచేవాడు. ప్రసన్నలక్ష్మి అతనని జగ్గూ అనేది. చదువులు పూర్తయ్యేదాకా అంటే పదిహేనేళ్ళు పైగా ఇద్దరూ ఒకే ఊళ్ళో పెరిగారు. రోజూ కలుసుకునే వారు. పక్కపక్కనే ఇళ్ళు.ప్రసన్నలక్ష్మి అందమైంది. ఆ మాట జగదీశ్‌ చెపుతాడు. కానీ, లక్ష్మిది, అతన్ని విపరీతంగా ఆకర్షించి, వ్యామోహపరిచే అందం కాదు.

అందుకే ఆమె విషయంలో అటూ ఇటూ కానట్టు, తటస్థంగా ఉండిపోయాడు. కానీ ప్రసన్నలక్ష్మి అలా ఊరుకోలేదు. బాహాటంగానే తనకి జగదీశ్‌ అంటే పిచ్చి ఇష్టమని వెల్లడించింది.జగదీశ్‌ ఇంటర్‌కొచ్చేటప్పటికి ప్రసన్నలక్ష్మి అతనే తనకి కాబోయే మొగుడని తెలిసున్న వాళ్ళందరిలో ప్రచారం చేసింది. వాళ్ళ వయసువాళ్ళులోనే కాదు, జగదీశ్‌, ప్రసన్నలక్ష్మి ఇళ్ళల్లో కూడా ఈ వార్త అందరికీ అలవాటైంది. ప్రసన్నలక్ష్మి తల్లీతండ్రి వచ్చి జగదీశ్‌ తల్లితండ్రితో మాట్లాడి వెళ్ళారు కూడా. వాళ్ళిద్దరికీ ఇష్టమైతే మనకిమాత్రం అభ్యంతరం ఏంముంటుందీ అనుకున్నారు. ఇంకా పిల్లల చదువులు పూర్తయ్యే వరకూ టైముందిగా అనుకున్నారు.ప్రసన్నలక్ష్మి పొద్దున్నే ఏడున్నరకల్లా టంచన్‌గా జగదీశ్‌ దగ్గరకి వచ్చేసేది. అప్పటికి జగదీశ్‌ నిద్ర లేచేవాడు కాదు. లక్ష్మి నిద్రలేపేది. ఇది నిత్యకార్యక్రమం. మళ్ళీ సాయంత్రం ఏడు ఏడున్నరకి వచ్చి, జగదీశ్‌ ఇంటికి వచ్చే వరకూ ఉండేది. రెండుపూటలా అతన్ని చూడాలి.