కొద్దిసేపట్లో రైలు వస్తుందని అనౌన్స్‌ చేశారు. చిట్టిపొట్టి రాజుబాబు ఫ్లాట్‌ఫారంమీద నిలబడి ఆసక్తిగా పట్టాలకేసే చూస్తున్నాడు. కొంచెందూరంలో నిలబడిన వాళ్ళనాన్నకి నల్లకోటు తొడుక్కున మనిషి ఏదో చెబుతున్నాడు. వాళ్ళనాన్న తల అడ్డంగా ఊపుతూ ఒక్కసారిగా ఫ్లాట్‌ఫాంపైనుంచి కిందకిదూకి పట్టాలమీద పడుకున్నాడు. రైలు దగ్గరకొచ్చేసింది. అప్పుడు రాజుబాబు ఏం చేశాడు? వాళ్ళనాన్న ఎందుకు అలాంటి పని చేశాడు?

ఇంటి నిండా పొగ కమ్ముకుంది.‘‘మాటకు ప్రాణము సత్యముకోటకు ప్రాణంబు సుభటకోటి ధరిత్రిన్‌బోటికి ప్రాణము మానముచీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!’’పద్యాన్ని పొద్దున నిద్రలేచిన దగ్గర్నుంచి చదువుతున్నాను. నాకు కూసింత దూరంలో నాయనమ్మ తిరగట్లో పెసలుపోసి ఇసురుతోంది. గరగరమంటా ఒకరకమైన పాటలా ఉందది. గేదెకు పాలు తీస్తున్నా, చల్లచేస్తున్నా వాకిలూడ్చినా సరే! అదోరకమైన పాటలాగా ఉంటది నాకు. అప్పుడునాకు నాయమన్మ ఇంకా అందంగా ఉండట్టు కనపడేది. అమ్మ కూడా పేడకళ్లాపి జల్లి పొడిముగ్గులేసి అవి బాగుండాయో లేదోనన్నట్టు గూత్తి వెనక్కి జరిగి చూసు కొనేది. అప్పుడు నేనక్కడుంటే, ముగ్గెట్టావుందని నన్నడిగేది! పొద్దున్నుంచి అమ్మ పొయ్యిదగ్గరే ఉంది. ఊదురు గొట్టాంతో తెగ ఊదుతోంది.

పచ్చి పుల్లలనుకుంటా సరిగ్గా మండక ఇల్లంతా పొగే! అమ్మ కళ్ళ నిండా నీళ్ళు.ఇంటిలోన పాత ట్రంకు పెట్టె ముందేసుకుని కాగితాలన్నీ బయటికి తీసి చూసుకుంటున్నాడు నాన్న. తుమ్మలనుంచి నిన్న కిష్టయ్య మామయ్య వచ్చిపోయిన దగ్గరునంచి నాన్న అదోలా ఉన్నాడు. నాన్నేకాదు, అమ్మ, అన్నయ్యలు కూడా ఓ మాదిరిగా ముఖాలుపెట్టుకుని ఉన్నారు.నా పుస్తకాలగూడు దగ్గరుండే ఉత్తరాలు గుచ్చే ఇనపతీగను తీసుకెళ్లాడు నాన్న.

ఆ తీగకు మా తాతయ్యమకొచ్చిన ఉత్తరాలు కూడా గుచ్చి ఉంటాయి.ఆలోచిస్తూనే మధ్యమధ్యలో పద్యం చదువుకుంటున్నాను. ‘‘పొద్దుగేల నుంచి పాడిందే పాడరా పాచిపళ్ల దాసరోడా అన్నట్టుగా దాన్నే తిరగేసి మరగేత్తున్నావు! ఇంకా రాలేదంటావు?’’ అడిగింది పెసలు ఇసురుకుంటానే నాయనమ్మ. కోపం వచ్చింది నాకు. దగ్గరకెళ్ళి పద్యం మొత్తం అప్పచెప్పేశా.‘‘చెవిటోడి దెగ్గిర శంఖం ఊదినట్టు నాకుచెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే! పోయి మీ నాన్నకు చెప్పుకో’’ అంది.