జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి‘‘మావాడు రానురానూ పెద్ద వేస్టుబాడీలా తయారవుతున్నాడు.’’‘‘అంత కానిపనేంచేశాడు?’’‘‘ఒకటా రెండా .. అన్నీ పనికిమాలిన పనులే.’’‘‘ఒక తండ్రిగా నీకు వాడిమీద ఇలాంటి అభిప్రాయం ఉండటం మంచిది కాదు.’’‘‘వినేవాడు దొరికితే నేనూ చెబుతానిలాంటి సవాలక్ష సూక్తులు.ఏదైనా తనదాకా వస్తేగానీ తెలీదు.’’‘‘మీ తండ్రీ కొడుకుల గొడవలోకి నన్ను లాగద్దు.చెప్పాలనిపిస్తే చెప్పు లేకపోతే మానెయ్‌.’’

‘‘లక్షల్లక్షలు పోసి మెడిసిన్‌ చదివిస్తున్నదెందుకు? వాడి భవిష్యత్తు కోసమేకదా?’’‘‘అలా నువ్వనుకోవడంలో నీ తప్పేం లేదు. ఎందుకంటే చదివించేప్పుడు తల్లిదండ్రులందరూ అలాగే అనుకుంటారు. కానీ, తమ అభిప్రాయం తప్పని అర్థమయ్యేసరికి జీవితం వాళ్ళ చేతుల్లోంచి జారిపోతుంది.’’‘‘తల్లిదండ్రుల ఆశలూ ఆశయాల గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకోవచ్చుగానీ ముందు వాడిని సరిదిద్దడానికి ఏం చెయ్యాలనేదానిగురించి ఆలోచించు.’’‘‘సరే చెప్పు. ఏమిటి వాడి ప్రాబ్లం? బాగా చదవట్లేదా మంచి మార్కులు తెచ్చుకోవడంలేదా చదివిందాన్ని అర్థం చేసుకోవట్లేదా లేక చదివింది గుర్తుండట్లేదా?’’‘‘అవన్నీ ఓకేగానీ ఒకటే పెద్ద ప్రాబ్లం.’’‘‘అవన్నీ ఓకే అయితే ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? కొంపదీసి గాళ్‌ ఫ్రెండ్స్‌తో తిరగడం, లవ్వులోపడ్డం లాంటి ప్రాబ్లమ్సా ఏంటి?’’‘‘అబ్బే అలాంటిదేం లేదు.’’

‘‘పోనీ అబద్ధాలు చెప్పడం, క్లాసులు ఎగ్గొట్టడం ... సినిమాలూ షికార్లూ ...’’‘‘ఊహూ ...’’‘‘మరింకేంట్రా అంత పెద్ద ప్రాబ్లం?’’‘‘వీడికి వందకి వంద మార్కులు రావలసింది. కానీ తొంభై తొమ్మిదే వచ్చాయి.’’‘‘ కేవలం ఒకే ఒక్క మార్కు తగ్గినందుకు నువ్వంతగా హైరానా పడి వాడి గురించి లేనిపోనివి ఊహించుకుని ఇంతదూరం పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఉందంటావా?’’‘‘రేయ్‌ నీలాంటివాడి దగ్గరకి పెర్సనల్‌గా మాట్లాడ్డంకోసం అప్పాయింట్‌మెంట్‌ తీసుకుని మరీ వచ్చానంటే అవసరం లేకుండానే వస్తానంటావా?’’

‘‘అయితే చెప్పు ఆ ఒక్క మార్కూ కూడా వెయ్యమని నన్ను రికమెండ్‌ చెయ్యమంటావా?’’‘‘వెటకారాలొద్దు. వాడికా మార్కు తగ్గడానికి కారణం ఏమిటో బోధపడటం లేదు.’’‘‘ఇది మరీ బాగుందిరోయ్‌. వాడిని ఒక్కమాట అడిగితే సరిపోయేదానికి రెండురోజులముందే అప్పాయింట్‌మెంట్‌ తీసుకుని కన్సల్టేషన్‌ ఫీజు కట్టి మరీ మన స్నేహాన్ని అవమానించాలంటావా చెప్పు?’’‘‘సారీరా .. నిన్ను అవమానించడంగానీ, బాధపెట్టడంగానీ నా ఉద్దేశం కాదు. ప్రొఫెషన్‌ ప్రొఫెషనే ... ఫ్రెండ్షిప్‌ ఫ్రెండ్షిప్పే. అందుకే అప్పాయింట్‌మెంట్‌ తీసుకున్నానుగానీ నాకు మరో ఉద్దేశం లేదు.’’