లేనిది ఉందనుకోవడంలో, ఉన్నది లేనిదానికంటే ఎక్కువని తలపోయడంలో అదో ఆనంద పథం భాద్రపదం! దాంతో ఇబ్బంది పడే వాళ్ళే ఇంటా బయటా ఎంతోమంది తయారయ్యారు. తన నైజాన్ని ఎవరూ కనిపెట్టలేరనే ఓ నమ్మకం! అదే తన వివేకమనే అవివేకంతో మమేకం అయ్యాడు! ఏదో సాంకేతిక వ్యాపారంలో బాగా కలిసివచ్చి తిరుగులేని కలిమి కలవాడ య్యాడు. మనసుకి చిలుం పట్టింది! విమానంలో వస్తుంటే మాటలు కలిపిన ఓ పెద్దమనిషి కొడుకు, పెళ్ళికొడుకని విన్నాడు. ఆ సంగతి భార్య ఉత్తరాషాడతో’ అన్నాడు. అని ఊరుకో లేదు. పెళ్ళిచూపుల సన్నాహాలు మొదలుపెట్టాడు !‘‘ఆ పెద్దమనిషికి బావగారి గురించి చెప్పుంటే తెలుసు అనేవాడేమోనండీ, ఇద్దరూ ఒకేచోట ఉండే వాళ్ళు కాబట్టి! ఏమండీ, బావగారు విశాఖపట్నంలో ఎప్పటినుంచో ఉంటున్నారు. కాస్త వాకబు చేయమనండీ’’ అంది ఉత్తరాషాడ.

‘‘అన్నయ్యకు స్థాయిగల పరిచయాలు ఉండే అవకాశమే లేదు. అయినా ఇది అప్పుడే అన్నయ్యకు తెలిపే విషయం కాదు’’ అన్నాడు.‘‘అదేంటండీ, అమ్మాయి పెళ్ళి పెద్దనాన్నకు చెప్పేది కాదంటారేం’’‘‘అన్లే, అప్పుడే కాదు, అన్నాను’’.‘‘అదే, ఆ కాదే ఎందుకని పోనీ మీరేమన్నా వివరాలన్నీ కనుక్కున్నారా అంటే అదీ లేదాయె’’ అంది అగమ్యమైన మనసుతో.‘‘అబ్బాయి, యన్నారై’’ ముఖంలో వేయి దీపాల వెలుగుతో అన్నాడు.‘‘గాలి తిరుగుళ్లే గాని, నేల నడకలు తెలియవు మీకు, ఎవరు తెలపాలో ఏంటో! అమెరికాలో పరిస్థితులు వెనకటిలా లేవట, వెళ్లిన వాళ్ళే వెనక్కు వస్తున్నారట’’ అంది ఉత్తరాషాడ.‘‘తెలుపులో నలుపేంటో బాగానే తెలిపావు గాని, నా లక్ష్యం అదికాదు’’ కళ్ళల్లో ఏదో ఘాడతను చూపిస్తూ అన్నాడు భాద్రపదం.

‘‘ఏవిటో అది’’ అడిగింది.‘‘ఆ రోడ్లమీద, ఆ వేగంతో అల్లుడుగారు కారు నడుపుతుంటే, నేను పక్కన కూర్చుంటే, అమెరికా అందాలు ఆస్వాదిస్తుంటే, మనసానందాలలో తేలియాడుతుంటే’’ ఘనంగా చెప్పి ఊహల్లోకి ఉరికాడు.‘‘పోన్లెండి. అదే విమానమై అందులో మీరొక్కరే ఉండాలనుకోలేదు! ఎవరు విన్నా నవ్వు తారండీ! అమ్మాయిని చూపించడం మానేసి అల్లుడు గారూ, మీకు డ్రైవింగు వచ్చా అని అడిగేట్లున్నారు’’ భర్త మనసుని తట్టిలేపుతూ అంది.