ప్రేమ అంటే ఏమిటి? రెండు శరీరాల్ని ఏకం చేసి చల్లబరుచుకోవడమే ప్రేమా? లేక మనసులను చల్లబరుచుకోవడం ప్రేమా? ముప్ఫై ఏళ్ళుగా ఆ ప్రశ్న అతడిని వెంటాడుతోంది. ఆమె ప్రేమ జడిలో తడిసిముద్దైపోతున్నా అతడికి ఆ అర్థం తెలియరాలేదు. పదే పదే ఆ ప్రశ్నకు సమాధానం కోసం వెతకుతూనే ఉన్నాడు. అలాంటి సమయంలో ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే..

అదొక ఆశ్రమం.అనాథ వృద్ధులు ఒకవైపు, అనాథ పిల్లలు మరోవైపు. వారిమధ్య చిరునవ్వులతో పలకరిస్తూ వడ్డన ఏర్పాట్లు చేస్తున్న అరవై ఏళ్ళ ముసలిది. వయసు మీదపడినా గట్టి శరీరం. తల తెల్లబడినా జింకపిల్లలా గెంతులేసే స్వభావం. అక్కడున్న అందరూ ఆమెను అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తారు.వడ్డన అయింది. భోజనాలు పూర్తయ్యాయి. ఆశ్రమాన్ని చీకట్లు కమ్మేశాయి. బయట వెన్నెల మాత్రం విరగబడి నవ్వుతోంది. అందరూ నిద్రకి సిద్ధపడినా, ఆమె మాత్రం నిద్రపోలేదు. తన వాడికోసం ఎదురుచూస్తోంది. ఆశ్రమంనిండా చెట్లు... పూలమొక్కలు ఆమె పెంచినవే. మామిడి చెట్టుకి వేలాడదీసిన ఉయ్యాల బల్లపై కూచొని వెన్నెలను ఆస్వాదిస్తోంది.

ఆ వెన్నెల్లో ఆమె ముఖంమీద బొట్టు వింత కాంతులీనింది. తన వాడు లేకుండా ఆమె నిద్రపోదు. అతడు ఆశ్రమ పనిమీద వేరే ఊరు వెళ్ళి ఇంకా రాలేదు. తన వాడి ఆలోచనలతో ఆమె నవ్వుకుంది.ఆలోచనల్లో ఉండగానే కారు శబ్దం వినవచ్చింది. డ్రైవరు ఉన్నా అతనే డ్రైవ్‌ చేస్తూ వచ్చాడు. ఎదురు వెళ్లింది. వయసులో ఆమెకి అతనికి ఐదేళ్ళు తేడా. కాని గట్టి పిండం. నిరంతర యోగసాధన ప్రకృతితో అతడు చేసిన స్నేహం అతన్ని ఆరోగ్యంగానే ఉంచింది.

అతని చేతిలో సంచి అందుకోవడానికి చేయి చాపింది ఆమె.నా బరువు నువ్వు నేను మోయనక్కర్లేదు అన్నాడు రోషంగా.ఏం నీ బరువు నేను మోయకూడదా అందామె అల్లరిగా.వీణ మీటినట్టు....సెలయేరు జలజలా పారుతున్నట్టు...కోయిలమ్మ కుహూకుహూ అని పలికినట్టు నవ్వింది.‘‘డబుల్‌ మీనింగా’’ అన్నాడతను.‘‘ఒకటే మీనింగ్‌. మీకు రెండో మీనింగ్‌ ఏం వినిపించింది!’’ మరింత అల్లరిగా అడిగింది ఆమె.