పిలుపుగంట అదేపనిగా మోగింది. విసుక్కుంటూ వెళ్లి వీధితలుపు తీస్తే వైష్ణవి.‘‘హాయ్‌ ఆంటి’’ అంది నవ్వుతూ. వీపుకు బ్యాక్‌ ప్యాక్‌, కిందొక చక్రాల సూట్కేసు. సామాన్లకు ఎయిరిండియా తాలూకు ట్యాగులు. సాయంకాలపు నీరెండ హాల్లోకి పడుతోంది.‘‘రా రా... బెంగుళూరునుంచేనా అల్లరిపిల్లా, యేమిటిలా ఫోను, మెస్సేజి లేకుండా వూడిపడ్డావు. మీ అమ్మైనా చెప్పలేదే, సునీత నిన్ననే గంటసేపు మాట్లాడింది. యేంటలా చిక్కిపోయావు, డైటింగా?’’ అన్నాను లోపలికి దారిస్తూ.‘‘నేనొస్తునట్టు అమ్మావాళ్లకి తెలీదు. నేరుగా మీయింటికే వచ్చేశా. అమ్మావాళ్లకి రేపో సర్‌ ప్రైజ్‌ యివ్వాలి’’ అంది గెస్ట్‌ రూంలోకి సూట్కేసు లాక్కెళ్తూ.‘‘పోన్లే హైదరాబాదునొదిలి వెళ్లాక యీ ఆంటీని మర్చిపోకుండా అప్పుడప్పుడైనా వస్తున్నావు’’ అనేసి వంటింట్లోకి వెళ్లాను సగంలో వదిలేసిన పని అందుకోవడానికి.

పావుగంట తర్వాత కాళహస్తి కలంకారీ వర్కుతోవున్న గోధుమరంగు టాపు, తెల్లటి పైజామా వేసుకుని ఫ్రెష్‌గా తయారయ్యి వంటింట్లోకి వచ్చి ఒక డైనింగ్‌ కుర్చీ లాక్కుని కూర్చుంది. తడి ఆరని ముంగురులు బరువుగా ఊగుతున్నాయి. సహజ శరీరాకృతి కొంత సడలింది. పనిలోబడి జిమ్‌లో వర్కవుట్లు తగ్గించినట్టుంది. ఏమైనా అందం, ఆరోగ్యాలు విలువలుగాకన్నా దీర్ఘకాలిక అవసరాలుగా తెలిసిన తరం. ‘చిక్కినా పిల్ల చక్కగా వుంది. పెళ్ల్లై, మూడేళ్ల కూతురుందంటే ఎవరూ నమ్మరు’ అనుకుంటూ అలాగే చూస్తుండిపోయాను. పరీక్షగా చూస్తే కళ్లకింద నీలిగీతలు, పనివొత్తిడితో నిద్రతక్కువైనట్టుంది.‘‘పాపెలావుంది’’ ఊరికే అడిగా, మొన్నే సునీత పాప కబుర్లు గంటసేపు చెప్పింది.‘‘దానికేం, అమ్మమ్మ దగ్గర లోటేముంది. పెద్దవాళ్లు దగ్గర లేకపోతే కెరీర్‌, పిల్లలూ రెండూ కుదరాలంటే కష్టం. నాలాంటి చాలామంది బాధ యిదే’’ అంది దిగులుగా.

‘యీపిల్ల చెప్పిన సర్‌ ప్రైజ్‌ యేమైవుండొచ్చా’ అని నాబుర్రలో ఒకమూల తొలుస్తూనే ఉంది. చూడనట్టుగా పొట్టవైపు చూశాను. లోపలికే ఉంది. మొహం అలసినట్టుందిగాని ఆ విశేషమేమీ ఉన్నట్టు లేదు. సరే ఇంతదూరమొచ్చిన పిల్ల అదేదో చెప్పదూ, చెప్పక పోయినా రేపు సునీత చెప్పదూ’ అనుకుంటూ, టీ కలిపి రెండుకప్పుల్లో పోసి ఒకటి తనకిచ్చాను.టీ తాగాక మొదటి అంతస్తులోకెళ్లాం. ఇక్కడే వైష్ణవి, కార్తీక్‌ పెళ్లైన వెంటనే మూడేళ్లు అద్దెకున్నారు. ప్రస్తుతం అద్దెకుండే వాళ్లు ఊరెళ్లారు. ముందువైపు వరండా అంచునున్న పారిజాతాన్ని, జాజితీగను ప్రేమగా నిమిరి కొన్నిపూలు కోసుకుంది. వెన్నెల్లో జాజితీగ నీడలో పాప ఈ వరండాలోనే దోగాడేదని గుర్తుచేసుకుని సంబరపడింది. టెర్రేస్‌ మీదికెళ్లాము. అక్కడ పందిరికిందవున్న వుయ్యాలను చూడగానే నిదానంగావెళ్లి కూర్చుంది. ఇది వరకులాగ చిన్నపిల్లలా పరుగున వెళ్లి ఊగలేదు. బోగన్‌ విల్లా పందిరినంతా కప్పేసి గుత్తులుగా ఎర్రని పూలు. ఆ పందిరిని, వుయ్యాలని నేనూ, మావారూ ఎంతో ముచ్చటపడి వేయించుకున్నా దాన్ని మాకంటే వైష్ణవి, కార్తీకే ఎక్కువగా వాడుకున్నారు. వాళ్లున్నన్నాళ్లూ తమ స్వంత పిల్లల్లా వుండేవాళ్లు. కార్తీక్‌ కొంచెం ముభావంగా ఉండేవాడు. సందడంతా వైష్ణవిదే.