‌చీకటిగా ఉన్న పడకగది తలుపు తెరుచుకోవడంతో హాల్లో వెలుగుతున్న ట్యూబులైటు వెలుతురు కొద్దిగా లోపలికి ప్రవేశించింది. మూసుకున్న రెప్పపై పడిన వెలుతురుకు అనుపమ కళ్ళు చికిలించి చూసింది. ‘‘పడుకున్నావా నానమ్మా’’ అంటూ నిత్య లోపలికి వచ్చి అనుపమ పక్కలో పడుకుంది. మామూలుగా అయితే నిత్య రాత్రి తొమ్మిదింటికే నిద్రపోతుంది. మర్నాడు ఆదివారం స్కూలు లేకపోవడంతో పదవుతోన్నా పడుకోమని అమ్మ చెప్పలేదు.హాల్లో నేలమీద పరిచిన పుస్తకాల మీద తల పెట్టుకుని చింటూ ఎప్పుడో నిద్రలోకి వెళ్ళిపోయాడు. వాడు ఒకపక్క టీవీ చూస్తూ మరోపక్క హోంవర్కు చేస్తూ తొందరగానే నిద్రపోతాడు. రోజూ ఎవరో ఒకరు వాడి పుస్తకాలు సర్ది వాడిని ఎత్తుకుని పక్కమీదకు తీసుకువెళ్ళాల్సిందే. తమ్ముణ్ణి అమ్మ బెడ్‌రూమ్‌లోకి మార్చి నిత్యని గదిమి టీవీ కట్టేసాక నిత్య నిరుత్సాహంగా వచ్చి నానమ్మ పక్కలో చేరింది.‘‘మీ నాన్నింకా ఆఫీసునుంచి రాలా? తమ్ముడేడీ’’ అన్నది అనుపమ మనవరాలితో పక్కలో సర్దుకుంటూ.‘‘నాన్నింకా రాలేదు.. తమ్ముడెప్పుడో పడుకున్నాడు. ఏదైనా కత చెప్పు’’ అన్నది నిత్య. నిజానికి నిత్యకి నానమ్మని కథ చెప్పమని అడగడం ఒక వంకే. నానమ్మ పక్కలో చల్లదనానికి వెంటనే నిద్రొచ్చేస్తుంది.‘‘ఏరోజైనా చెప్పిన కత పూర్తిగా విన్నావా? కథలేదు ఏంలేదు.’’‘‘నీకే కథ చెప్పడం రాదు. ఏదీ అర్థమయ్యేలా చెప్పవు.’’‘‘వింటే ఏదైనా అర్థమవుతుంది. సరే విను. నిద్రపోకు.’’

***********************

అనుపమ వెల్లకిలా పడుకుని దిండుమీద తలాన్చి చెప్పడం మొదలెట్టింది. నిజానికి అనుపమకి అంతబాగా పిల్లలకి కథలు చెప్పడం రాదు. చిన్నతనంలో తండ్రి దగ్గర కథలు వినిందిగానీ అవేమీ గుర్తులేవు. ఎప్పుడోవిన్న రాజు గారి ఏడు చేపలు కథలో చివరికి చేపలు ఏమౌతాయో కూడా మర్చిపోయింది. రాజుగారు వేటకివెళ్ళి ఏడు చేపలు తేవడం వరకే ఆమె ఎరుగుదును.. ఇన్నేళ్ళ కాలంలో.ఎప్పుడన్నా మనవరాలు కథ చెప్పమన్నప్పుడు అప్పటి కప్పుడు ఏవేవో తనకు తోచింది, ఊహకి అందినదల్లా కల్పించి చెబుతుంది. ఆ కథలకి తీరూతెన్నూ ఉండదు. మొదలు పెట్టగానే నిత్య నిద్రలోకి వెళ్లిపోతుంది. కనుక అనుపమ చెప్పేవన్నీ అసంపూర్ణ కథలే.